Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరణ ఇవ్వండి: కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : మూక దాడి, విద్వేష ప్రసంగాల్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో కొన్ని సూచనలు చేసింది. మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ అంశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టాయో తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీచేసింది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటో తెలపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్రాల హోంశాఖ అధికారులతో మాట్లాడి మూడు వారాల్లోగా తగిన వివరాలు తెప్పించాలని సుప్రీం చెప్పింది. విద్వేష వ్యాఖ్యలు, ప్రసంగాలు, మూకదాడులు, హింస, పుకార్లు..మొదలైనవాటిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పదుల సంఖ్యలో సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటీని ఒకేసారి విచారణ చేపట్టబోతున్నట్టు సుప్రీం తెలిపింది. దేశవ్యాప్తంగా విద్వేష ప్రసంగాలు పెరిగాయని, మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని..వీటిపై విచారణ జరపాలని సుప్రీంకోర్టులో జమాతే ఉలేమా హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ అసాద్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎ.ఎం.ఖాన్వికార్ నేతృత్వంలోని ధర్మాసనం పై ఆదేశాలు జారీచేసింది. మూక దాడి, హింస, విద్వేష ప్రసంగాలకు సంబంధించి రాష్ట్రాల వారీగా ఒక ఛార్ట్ రూపొందించి ఇవ్వాలని పిటిషనర్‌ను సుప్రీం కోరింది. ఆ ఛార్ట్‌ను వారంలోగా ఆయా రాష్ట్రాలకు పంపాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఆ ఘటనలపై తీసుకున్న చర్యలేంటో తెలపాల్సిందిగా రాష్ట్రాలను కోరింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది మీనాక్షీ ఆరోరా మాట్లాడుతూ..''మూక దాడి, హింస, విద్వేష ప్రసంగాల్ని ఎలా అడ్డుకోవాలి? నియంత్రించాలి? అన్నది 2018నాటి తెహసీన్ పూనావాలా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. సమాజంలో జాతి వివక్ష, ఆధిపత్య భావజాలం, అసహనం పెరిగినప్పుడు..విద్వేష ప్రసంగాలు, దాడులు మొదలవుతున్నాయి. విద్వేషపూరిత నేరాలకు కారణమవుతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే''నని అన్నారు.