Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళను మెయింటెనెన్స్ గదిలోకి లాక్కెళ్లి..
న్యూఢిల్లీ : నిర్భయలాంటి ఘటనలకు దేశంలో అడ్డుకట్ట పడటం లేదు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమికూడే ప్రదేశాల్లోనే యువతులు, మహిళలపై దాడులు జరుగుతున్నాయి. దేశ రాజధానిలో శనివారం అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు రైల్వే ఉద్యోగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు మీడియాకు విడుదల చేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన ఓ మహిళ (30) రెండేండ్ల క్రితం భర్త నుంచి విడిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో తన స్నేహితుడి ద్వారా నిందితుల్లో ఒకడైన సతీష్..ఆమెకు పరిచయమయ్యాడు. అనంతరం, ఆమెకు రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పాడు. ఈ క్రమంలోనే గురువారం ఆమెకు సతీష్ ఫోన్ చేసి..తన కొడుకు పుట్టినరోజు వేడుక సందర్భంగా తమ కొత్త ఇంటికి రావాలని పిలిచాడు. సరేనని చెప్పిన బాధిత మహిళ, రాత్రి 10.30 గంటల సమయంలో కీర్తినగర్ మెట్రో స్టేషన్లో సతీష్‌ను కలుసుకుంది. అనంతరం ఆమెను సతీష్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి..బాధితురాలిని రైల్వే స్టేషన్లోనే దూరంగా ఉన్న ఫ్లాట్‌ఫామ్ వద్ద గల మెయిన్టెనెన్స్ గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కాగా..బాధితురాలు..శుక్రవారం తెల్లవారుజామున 3.27 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. పోలీసులు వెంటనే స్టేషన్‌కు చేరుకొని ఆమెను రక్షించినట్టు రైల్వే డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని..నిందితులు సతీష్, వినోద్, మంగళ్‌చంద్, జగదీష్చంద్లను అరెస్టు చేసినట్టు తెలిపారు.