Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ అదుపులో మంత్రి సన్నిహితురాలు
న్యూఢిల్లీ : ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీని శనివారం ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. దీనికి ముందు కోల్కతాలోని మంత్రి నివాసంలో అధికారులు 23 గంటలపాటు ఆయనను ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో ఆయన సహకరించలేదని, దాంతో ఆయన్ను అరెస్టు చేశామని ఈడీ వెల్లడించింది. మంత్రి అనుచరురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో శుక్రవారం రూ.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ అరెస్టు చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆమెను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ఈడీ అధికారులు మంత్రి, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, విద్యా మంత్రి ప్రకాశ్ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య, మరికొందరి నివాసాలపైనా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన పి.కె.బందోపాధ్యారు, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ తదితరుల ఇండ్లలోనూ సోదాలు జరిగాయి. అర్పితా ఇంట్లో రూ.20 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించిందేనని భావిస్తున్నట్టు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. శనివారం కూడా అర్పితా నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. పలు ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు, రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్ర ఆభరణాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.