Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఎస్ రద్దు చేయాలి...
- ఓపీఎస్ అమలు చేయాలి
- కేరళ మోడల్ ప్రభుత్వ విద్యా కావాలి
- దేశవ్యాప్త పోరాటం...
- డిసెంబర్లో పార్లమెంట్ మార్చ్ :
- ఎస్టీఎఫ్ఐ జాతీయ సదస్సులో తీర్మానం
న్యూఢిల్లీ : నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) రద్దు చేయాలని, దానికి ప్రత్యామ్నాయాలు అమలు చేయాలని ఎస్ఎటిఎఫ్ఐ జాతీయ సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ పథకం (ఎన్పీఎస్)ను రద్దు చేయాలని, పాతన పెన్షన్ పథకం (ఒపిఎస్)ను అమలు చేయాలి డిమాండ్ చేశారు. ఆదివారం నాడిక్కడ ఇంద్రజిత్ గుప్తా మార్గ్‌లోని హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టిఎఫ్ఐ) ఆధ్వర్యంలో జాతీయ విద్యా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మూడు దశల పోరాట కార్యాచరణకు సంబందించిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆగస్టు 12 (ఎస్టిఎఫ్ఐ ఆవిర్భాదినోత్సం) నుంచి అక్టోబర్ 5 (ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం) వరకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, మేథావుల సంతాకాల సేకరణ చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 23 నుండి దేశవ్యాప్తంగా జాతాలు నిర్వహించాలని, డిసెంబర్లో పార్లమెంట్ మార్చ్ నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది. ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ రాజీవ్ కున్వర్ విద్యా రంగంలో మోడీ సర్కార్ తీసుకొచ్చిన మార్పులను వివరించారు. ప్రభుత్వం విద్యాను సర్వ నాశనం చేసే కుట్రలో భాగంగా అనేక చర్యలు చేపట్టిందని విమర్శించారు. యూనివర్శిటీలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. చరిత్రను వక్రీకరిస్తూ పాఠ్యంశాలు తయారీ చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పుస్తకాల్లో మార్పులు చేశారని తెలిపారు. లౌకిక, ప్రజాస్వామ్య, శాస్త్రీయ భావాలను పక్కన పెట్టి, మతోన్మాదాన్ని చొప్పించే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. విద్యా వేత్త, ఎస్టిఎఫ్ఐ మాజీ కోశాధికారి సత్యపాల్ సివాచ్ నూతన విద్యా విధానం (ఎన్ఈపి)ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఈపికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, వాటిని అమలు చేయాలని సూచించారు. కేరళ రాష్ట్ర కరిక్యూలమ్ కమిటీ సభ్యుడు డాక్టర్ సి. రామకృష్ణ మాట్లాడుతూ దేశంలోనే ప్రభుత్వ విద్య రంగంలో కేరళ ఒక మోడల్‌గా నిలిచిందని అన్నారు. ప్రభుత్వ విద్యా చాలా పటిష్టంగా ఉంటుందని, మెజార్టీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కరిక్యూలమ్ కూడా పూర్తిగా శాస్త్రీయంగా ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు పెద్దగా కనిపించవని, ప్రజలు కూడా ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వరని పేర్కొన్నారు. కేరళ మోడల్ ప్రభుత్వ విద్యాను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలి: తపన్ సేన్
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడుతూ నూతన పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌పీఎస్‌తో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు నష్టం కలుగుతుందని, దీనివల్ల కార్పొరేట్లకు మాత్రమే లాభం చేకూరుతుందని అన్నారు. ఈ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని అన్నారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయూషీ ఘోష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత విద్యపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడిని వివరించారు. యూనివర్శిటీలపై దుష్ప్రాచారం చేస్తున్నారని, యూనివర్శిటీల్లోని ప్రజాస్వామ్య వాతారణాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఏఐఎస్జిఈఎఫ్ నేత కమలేష్ మిశ్రా మాట్లాడుతూ విద్య ప్రైవేటీకరణ సమాజ హితానికి నష్టం చేస్తుందని అన్నారు. దీన్ని తిప్పికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెసి హరి కిషన్, సిఎన్ భారతి, ఏపి యుటీఎఫ్ గౌరవ అధ్యక్షులు కె.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి, తెలంగాణ నుంచి యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య, ఉపాధ్యక్షురాలు సిహెచ్ దుర్గా భవాని, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, పి.మానిక్ రెడ్డి, వి.శాంతి కుమారి, ఆర్.శారద, జి. నాగమణి, బి.రాజు, ఈ.గాలయ్య, జి.శ్రీధర్ పాల్గొన్నారు.