Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం బడ్జెట్లో 8.2శాతం నిధులివ్వాలని నిటి ఆయోగ్ మార్గదర్శకాలు
- రూ.4లక్షల కోట్లు కేటాయించాలి.. రూ.1.3లక్షల కోట్లకు పరిమితం
- స్కాలర్షిప్స్, గృహ నిర్మాణ పథకం, సంక్షేమం, అభివృద్ధిపై దెబ్బ
- పోడు భూముల సమస్య పరిష్కారంలో అట్టడుగున బీజేపీ పాలిత రాష్ట్రాలు
- 'ద్రౌపదీ ముర్ము' పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో లబ్దిపొందాలని ప్రధాని మోడీ ఆరాటం
న్యూఢిల్లీ : ఎనిమిది ఏండ్లుగా మోడీ సర్కార్ అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తోంది. పోడు భూముల సమస్యలు పరిష్కారం కావటం లేదు. దాంతో ఆ సామాజిక వర్గంలో బీజేపీ పట్ల తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి నెలకొని ఉంది. దీనిని తుడిచివేయడానికి రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము పేరును తెరమీదకు తీసుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మును ప్రకటించగానే, దేశవ్యాప్తంగా మోడీ అనుకూల మీడియా ఆహా..ఓహో అని వార్తా కథనాల్ని వండివార్చుతోంది. గుజరాత్ తూర్పు ప్రాంతం నుంచి ఒడిషా వరకు అనేక గిరిజన, ఆదివాసీ తెగలున్నాయి. వాయువ్య మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
ఇందులో ప్రస్తుతం మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో బీజేపీ అధికారంలో ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో అడ్డదారిలో అధికారాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఇక్కడెక్కడా కూడా అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలుజేయటం లేదు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిధులు ఖర్చు కాగితాలకే పరిమితం. గిరిజనులపై దాడుల్ని అరికట్టడం లేదు. ఇవన్నీ అక్కడ చర్చనీ యాంశంగా మారాయి. ఇప్పుడు ద్రౌపదీ ముర్ము పేరు చెబుతూ ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా లబ్దిపొందాలని బీజేపీ తెగ తాపత్రయపడుతోంది.
వేధింపులే మిగిలాయి..
అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హులైనవారికి భూమి హక్కులు కల్పించాలి. దీనివల్ల అణగారిన వర్గాల్లో సామాజికంగా, ఆర్థికంగా సాధికారత వస్తుందని నిపుణులు సూచించారు. అనేక రాష్ట్రాల్లో పోడు భూములపై సాగు హక్కులు కోరుతూ ప్రభుత్వాలకు దరఖాస్తులు వచ్చాయి. మార్చి 2022నాటికి ఉన్న సమాచారం ప్రకారం, భూమి హక్కులు కల్పిస్తూ అత్యధికమంది మంది గిరిజనులకు టైటిల్ డీడ్ ఇచ్చిన రాష్ట్రాల జాబితా తయారుచేస్తే, అందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు లేనే లేవు. చాలా తక్కువ సంఖ్యలో గిరిజనులున్న ఉత్తరప్రదేశ్‌లో సైతం అక్కడి యోగి సర్కార్ సమస్యలు పరిష్కరించలేదు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో పోడు భూముల సమస్య తీవ్రరూపం దాల్చింది. ఎక్కడికక్కడ పాలకులు పోలీసులతో గిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్నారు. అటవీ అధికారులు, పోలీసులు, పారా మిలటరీ రంగంలోకి దిగి గిరిజనుల పంటల్ని నాశనం చేస్తున్నారు. అక్కడున్న వ్యవసాయ పనిముట్లను, వాహనాల్ని తీసుకెళ్తున్నారు. ఇష్టమున్నట్టు కేసులు పెడుతూ వేధిస్తున్నారు.
నిధులైనా ఇస్తున్నారా?
ఎస్సీ, ఎస్టీల జనాభా వరుసగా 15.49శాతం, 8.2శాతం మేరకు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేయాలని 'నిటి ఆయోగ్' 2017లో మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ రూ.49.3 లక్షల కోట్లు. ఇందులో 8.2శాతం గిరిజనుల కోసం ఖర్చు చేయాలి. ఇది సుమారుగా రూ.4లక్షల కోట్లకు సమానం. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ గణాంకాల్ని పరిశీలిస్తే..గిరిజనులకు సంబధించిన వివిధ పథకాలు, ప్రాయోజిత పథకాల ఖర్చుకు బడ్జెట్ కేటాయింపులు రూ.1.3లక్షలకు పరిమితం. దీనివల్ల ఆ సామాజికవర్గంలో చిన్నారులు, యువకులు విద్యకు దూరమవుతారు. స్కాలర్షిప్స్ అందుకోలేరు. గృహనిర్మాణ పథకం ఆగిపోతుంది. గిరిజన హక్కుల అమలు ప్రశ్నార్థకంగా మారుతుంది. దేశవ్యాప్తంగా కొన్ని కోట్లమందిపై ప్రభావం ఉంటుంది.
2018-19 కేంద్ర బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి నిధుల కేటాయింపు 4.9శాతానికే పరిమితమైంది. వాస్తవ గణాంకాల ప్రకారం కేటాయింపు 2.5శాతమే ఉంది. 2019-20లో బడ్జెట్ కేటాయింపు 5.5శాతం, వాస్తవ కేటాయింపు 2.3శాతం, 2020-21లో 5.9శాతం...వాస్తవ కేటాయింపు 2.2శాతం, 2021-22లో 7.4శాతం..వాస్తవ కేటాయింపు 2.6శాతం. నిధుల కేటాయింపు ఈ విధంగా ఉంటే, ఎస్టీలకు ఉద్దేశించిన కేంద్ర పథకాలు, ప్రాయోజిత పథకాల అమలు ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇందుకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం అమలు మంచి ఉదాహరణ. గిరిజనుల కోసం 8.2శాతం నిధులు ఖర్చు చేయాల్సిన చోట..కేవలం 3.6శాతంతో మమ అనిపిస్తున్నారు.