Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కొన్ని దశాబ్ధాల పర్యవేక్షణ తరువాత కూడా గంగా నదిలోకి యథేచ్ఛగా వ్యర్థాలు, మురుగు నీరు వదులుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆరోపించింది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకునే స్థితిలో గంగ ప్రక్షాళన కోసం ఉద్దేశించిన జాతీయ మిషన్ ఉన్నట్లు కనిపించడం లేదని విమర్శించింది. ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని నేషనల్ గంగా కౌన్సిల్ (ఎన్జిసి)ని ఎన్జిటి చైర్పర్సన్ జస్టిస్ ఆదేశ్కుమార్ గోయోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. నాణ్యత నిబంధనల ప్రకారం గంగా నదిలో నీరు ఉండాలని, ఎందుకంటే గంగా నదిలో నీటిని సాన్నానికి మాత్రమే కాదు, తాగటానికీ ఉపయోగిస్తారని తెలిపింది. తదుపరి విచారణ తేదీ అక్టోబర్ 14లోగా నివేదిక ఇవ్వాలని ఎన్జిసి సభ్య కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. సరైన చర్యలు తీసుకోని కారణంగా గత 37 ఏండ్ల నుంచి పర్యవేక్షణ జరుగుతున్నా.. ఇప్పటికీ కనీసం 50 శాతం కూడా శుద్ధి చేయని మురుగు నీటిని, గణనీయమైన పారిశ్రామిక వ్యర్థాలను గంగా నది లేదా దాని ఉపనదులు, డ్రెయిన్ల్లో కలుపుతున్నారని ఎన్జీటీ తెలిపింది. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా ఉల్లంఘనకు గురవుతున్నాయని ఆరోపించింది. నివారణ చర్యలు చేపట్టాల్సిన వారి వైఖరిలో మార్పు రావాలని, మార్పు జరగకపోతే ఈ ట్రిబ్యునల్ పర్యవేక్షణ వలన ఎలాంటి ప్రయోజనం కలగదని పేర్కొంది.