Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాణ స్వీకారం చేయించనున్న సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిలీ: 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయన్నారు. సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నది. ఉదయం 10:15 గంటలకు ద్రౌపది ముర్ముతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించిన మొదటి తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వి రమణ నిలుస్తారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్యసభ చైర్మెన్ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య వేత్తలు, పార్లమెంటు సభ్యులు, ప్రధాన పౌర, సైనిక అధికారులు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతిగా ఎన్నికైన ముర్ము ఉత్సవ ఊరేగింపులో సెంట్రల్ హాల్‌కు చేరుకుంటారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ సమక్షంలో రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత 21 తుపాకీలతో వందనం స్వీకరిస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తారు. వేడుక ముగిశాక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరి వెళతారు. అక్కడ ఆమెకు ముందు కోర్టులో ఇంటర్-సర్వీసెస్ గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వబడుతుంది. పదవీ విరమణ చేసిన రాష్ట్రపతికి మర్యాదలు అందజేయబడతాయి. ఆదివారంతో రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ముగిసింది. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన రెండవ మహిళగా, మొదటి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు.