Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ, ఎంపీ రాష్ట్రాల్లో అత్యధికం
- లోక్సభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా నేరాలు పెరిగాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు యూపీ, ఎంపీలలో ఇవి అత్యధికంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్రం లోక్సభలో వెల్లడించింది. తెలంగాణ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డిలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా ఈ సమాచారాన్ని పార్లమెంటు ముందు పొందుపరిచారు. దీని ప్రకారం.. 2018 నుంచి 2020 మధ్య ఎస్సీలకు వ్యతిరేకంగా నేరాల కేసులు 17.52 శాతం పెరిగాయి. ఎస్టీల విషయంలో ఇది 26.71 శాతంగా ఉన్నది.
ఎస్సీలకు వ్యతిరేకంగా 2018లో 42,793 నేరాలు నమోదయ్యాయి. 2019లో ఇది 45,961గా, 2020లో 50,291గా రికార్డయ్యాయి. ఎస్సీలకు వ్యతిరేకంగా 2020లో యూపీలో అత్యధికంగా 12,714 కేసులు నమోదయ్యాయి. 39,138 కేసులలో చార్జీషీట్లు ఫైల్ అయ్యాయి. 2020 ఏడాది ముగింపు నాటికి 19,825 కేసుల్లో దర్యాప్తు పెండింగ్లో ఉన్నది.
ఎస్టీలకు వ్యతిరేకంగా 2018లో 6,528 క్రైమ్ కేసులు రికార్డయ్యాయి. 2019లో 7,570, 2020లో అత్యధికంగా 8,272 నేరాలు నమోదయ్యాయి. ఎస్టీలకు వ్యతిరేకంగా 2020లో మధ్యప్రదేశ్లో అత్యధికంగా 2401 కేసులు రికార్డయ్యాయి. 2020లో 6,484 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. అదే ఏడాది ముగింపు నాటికి 3,351 కేసులు పెండింగ్లో ఉన్నాయి.