Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మైనారిటీ' వీధి వ్యాపారుల్లో కేవలం 0.01 శాతం మందికి లబ్ది
- ఫలితమివ్వని కేంద్ర పథకం
- ఆర్టీఐ సమాధానంలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలోని మైనారిటీ వర్గాలకు చెందిన వీధి వ్యాపారుల కోసం ఉద్దేశించిన కేంద్ర పథకం పీఎం స్వనిధి ఆశించిన స్థాయిలో ఫలితాలను చూపెట్టటం లేదు. ఈ పథకం కింద లబ్ది పొందిన వారి సంఖ్య అతి స్వల్పంగా ఉన్నది. దేశవ్యాప్తంగా 0.01 శాతం మంది మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం(రుణాలు) పొందారు. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద దాఖలైన ప్రశ్నకు వెల్లడైన సమాధానంలో ఈ విషయం తెలిసింది. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ సభ్యులు వెంకటేశ్ నాయక్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారాన్ని వెల్లడించింది. దీని ప్రకారం.. ఈ పథకం కింద 2020 జూన్ నుంచి 2022 మే మధ్య అతి స్వల్పంగా 0.01 శాతం మంది మాత్రమే లబ్ది పొందారు. ఈ సమయంలో మొత్తం 32.26 లక్షల రుణాలు పంపిణీ అయ్యాయి. దేశవ్యాప్తంగా లబ్దిదారుల్లో 3.15 శాతం మంది ఎస్టీ సామాజిక వర్గం నుంచి, 0.92 శాతం మంది వికలాంగులున్నారు. మైనారిటీ వర్గాల నుంచి లబ్దిపొందిన వారి సంఖ్య మహారాష్ట్ర (162 మంది)లో అత్యధికంగా ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (110), తెలంగాణ (22), గుజరాత్ (12), ఒడిశా (8) లు ఉన్నాయి. వికలాంగుల విభాగంలో తమిళనాడులో అత్యధికంగా (8,631) మొదటి రుణ దరఖాస్తులున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో యూపీ, కర్నాటకలు నిలిచాయి. మొదటి, రెండో దశ రుణాలకు యూపీలో అత్యధికం (7,278 మంది)గా దరఖాస్తులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని 2020 జూన్లో కేంద్రం అమలు చేసింది. వీధి వ్యాపారులు పట్టణ ప్రాంతాలలో తమ వ్యాపారాలను పున:ప్రారంభించటంలో సహాయపడేందుకు ఇది ఒక ఏడాది కాల వ్యవధిలో రూ. 10,000 వరకు రుణాలను అందిస్తుంది. లబ్దిదారులు ఈ రుణాలను సకాలంలో చెల్లిస్తే.. తదుపరి అధిక పరిమితితో కూడిన రుణాలు పొందటానికి అర్హులవుతారు.