Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరలు పెరుగుదలపై కొనసాగుతున్న ప్రతిపక్షాల ఆందోళన
- ఉభయ సభలు వాయిదా
- నీరాజ్ చోప్రాకు పార్లమెంట్ అభినందనలు
న్యూఢిల్లీ : నలుగురు కాంగ్రెస్ ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్, టిఎన్ ప్రతాపన్, జ్వోతిమణి సెన్నిమలై, రమ్యా హరిదాస్ పార్లమెంట్ జరిగే మిగతా రోజులన్ని వారు సభా కార్యకలాపాల్లో
పాల్గొనేందుకు లేదు. సోమవారం పార్లమెంట్ ఉభయ సభల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించిన అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆందోళనను ఆరో రోజు కూడా కొనసాగించాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పర్వం తొక్కాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన లోక్‌సభ ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ షిప్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపింది. వెంటనే పెరిగిన ధరలపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి చర్చకు పట్టు పట్టారు. ప్లకార్డు చేబూని నినాదాల హౌరెత్తించారు. స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకొని సభ్యులు సభా మర్యాదలను పాటించాలనీ, అందరూ తమ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని చెప్పారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాల ఆందోళన నడుమ ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. గందరగోళం మధ్యే దాదాపు 20 నిమిషాలు పాటు ప్రశ్నోత్తరాలు జరిగిన తరువాత, స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. ప్యానల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ రూల్ 377 కింద జీరో అవర్ నిర్వహించారు. కొద్ది సమయం తరువాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ దుష్ప్రవర్తన కింద ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష ఎంపీల్లో నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్, టిఎన్ ప్రతాపన్, జ్వోతిమణి సెన్నిమలై, రమ్యా హరిదాస్‌ను పార్లమెంట్ జరిగే మిగిలిన రోజులు సస్పెండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని ప్యానల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ తీర్మానాన్ని ముజువాణి ఓటుతో ఆమోదించి, ఆ నలుగురు సభ్యులు సభ నుంచి వెళ్లి పోవాలని ఆదేశించారు. అనంతరం సభను నేటి(మంగళవారం)కి వాయిదా వేశారు. నలుగురు కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు సస్పెన్షన్‌కు గురైన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ తమ ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రభుత్వం మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజ్యసభలో అదే తీరు
మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ఇటీవలి రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేసిన సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ షిప్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపింది. ఆ తరువాత ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడ ుతూ ధరలు పెరుగుదలపై చర్చ చేపడతామని అన్నారు. కానీ ఎందుకు చర్చ చేపట్టటం లేదని ప్రశ్నించారు. దీనిపై డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ చైర్మన్‌ను సంప్రదించాలని బదులిచ్చారు. వెంటనే అధికార పక్షనేత పియూశ్ గోయల్ మాట్లాడుతూ తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చిన వెంటనే చర్చ చేపడతామని అన్నారు. టీఎంసీ ఎంపీ డెరిక్ ఓ బ్రెయిన్ మాట్లాడుతూ 2017 జులై నుంచి 2022 జులై వరకు ఐదేండ్ల పాటు రూల్ నెంబర్ 267 కింద ఒక్క అంశంపై కూడా చర్చ జరగలేదని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ధరలు పెరుగుదలపై చర్చ జరపాలని నినాదాలు హౌరెత్తించారు. డిప్యూటీ చైర్మెన్ సభ్యులంతా తమ స్థానాల్లోకి వెళ్లాలని, సావధాన తీర్మానం చర్చకు ఆమోదించబడిందని, దానిపై చర్చిద్దామని అన్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోని ఆందోళన కొనసాగించారు. దీంతో సభ గందరగోళం నెలకొనడంతో సభ ప్రారంభమై 14 నిమిషాలకే మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర ప్యానల్ చైర్మెన్‌గా వ్యవహరించారు. ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ప్రతిపక్షాల ఆందోళన నడుమ ఎన్సీపీ ఎంపీ ఫౌజియా ఖాన్ కరోనా తరువాత కేసులు పెరిగిన పరిస్థితిపై సావధాన తీర్మానం ప్రవేశపెట్టారు. పియూశ్ గోయల్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు సభను జరగనివ్వటం లేదని అన్నారు. ఎంపీ ఫౌజియా ఖాన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ధరల పెరుగుదలపై చర్చ కోసం డిమాండ్ చేస్తున్నారని, దానిపై చర్చ పెట్టాలని కోరారు. ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించడంపై చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు నినదించారు. వెంటనే సభను ఎనిమిది నిమిషాలకే సాయంత్రం నాలుగు గంటల వరకు వాయిదా వేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు తన పదవికి తగిన సీటు ఇవ్వలేదని పలువురు ప్రతిపక్ష నేతలు రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖలు రాశారు.