Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత 15 వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు
- ముర్ము చే ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- అంతకు ముందు మహాత్మా గాంధీకి నివాళి
- నితీశ్ దూరం....టీఆర్ఎస్ బహిష్కరణ
న్యూఢిల్లీ:భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత సోమవారం ఉదయం రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించారు. అక్కడ నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ఆమె, పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన కుటుంబాన్ని కలిశారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా అధికారిక వాహనంలో పార్లమెంట్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము, రామ్‌నాథ్ కోవింద్‌లను, పార్లమెంట్ హౌస్ ముఖద్వారం వద్ద ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. అక్కడ నుంచి అందరూ కలిసి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు చేరుకుని, అందరికి నమస్కారం పెడుతూ వేదిక వద్దకు వచ్చారు. వేదికపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆశీనులయ్యారు. ద్రౌపది ముర్ము చేత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణం స్వీకారం చేయించారు. వెంటనే ఆమె ప్రమాణ స్వీకారం చేసినట్టు సంతకం చేశారు. ఆ తరువాత అప్పటి వరకు రాష్ట్రపతి స్థానంలో కూర్చున్న రామ్‌నాథ్ కోవింద్ ఆ స్థానాన్ని ద్రౌపది ముర్ముకు అప్పగించారు. అనంతరం వేదిక నుంచి దిగి మొదటి వరుసలో కూర్చున్న వారికి నమస్కారం చేస్తూ తిరిగి రాష్ట్రపతి భవన్‌కు బయలు దేరారు. పార్లమెంట్ హౌస్ ముఖద్వారం వరకు ద్రౌపది ముర్ము, రామ్‌నాథ్ కోవింద్ వెంట ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీజేఐ ఎన్వి రమణ, స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. అక్కడ సైనిక వందనం స్వీకరించిన తరువాత ముర్ము, కోవింద్ అధికారిక వాహనంపై రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా సైనిక వందనం స్వీకరించారు. అనంతరం అదే వాహనంపై రాష్ట్రపతి భవన్‌లోకి చేరుకున్న ద్రౌపది ముర్ము కమిటీ రూంలోకి చేరుకొని, తన నూతన కార్యాలయం, నూతన నివాసం వైపు వెళ్లారు.
కోవింద్ తనకు కేటాయించిన తాత్కాలిక నివాసానికి చేరుకున్నారు. ప్రమాణోనోత్సవ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, ఎస్.జయశంకర్, పియూశ్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా,బీజేపీ సీనియర్ నేత మనోహర్ జోషి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, ఏక్నాథ్ షిండే, అశోక్ గెహ్లాట్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ,ఏపీ గవర్నర్లు విశ్వ తమిళి సై, భూషన్ హరిచందన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయాతో సహా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తదితరుల పాల్గొన్నారు. దౌత్య అధిపతులు, త్రివిధ దళాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దూరంగా ఉన్నారు. టీఆర్ఎస్ వాకౌట్ చేసింది.