Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నా బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తా
- జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం
- స్వావలంబనతో కూడిన దేశ నిర్మాణం
- నేను రాష్ట్రపతి అవ్వటం ప్రజాస్వామ్య గొప్పతనం
న్యూఢిల్లీ: రాజ్యాంగ వెలుగులో తన బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉజ్వలమైన, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడానికి మనమందరం ఏకమై అంకిత భావంతో కర్తవ్య మార్గంలో ముందుకు సాగాల్సిన అవరముందని ఆమె పేర్కొన్నారు. 15 రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం చేశారు. ''దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి నన్ను ఎన్నుకున్నందుకు పార్లమెంట్, శాసనసభల సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు వేసిన ఓటు దేశంలోని కోట్లాది మంది పౌరుల విశ్వాసానికి నిదర్శనం. దేశ పౌరులందరి ఆశలు, ఆకాంక్షలు, హక్కులకు ప్రతీక అయిన ఈ పవిత్ర పార్లమెంటు నుంచి తోటి పౌరులందరికీ నేను వినయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా విధులు, బాధ్యతలను నిర్వర్తించడంలో మీ ఆప్యాయత, నమ్మకం, మద్దతు నాకు గొప్ప బలం. 'ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్' జరుపుకుంటున్న కీలక సమయంలో దేశం నన్ను రాష్ట్రపతిగా ఎన్నుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 50 ఏండ్లు జరుపుకుంటున్న సమయంలో నా రాజకీయ జీవితం ప్రారంభం కావడం కూడా యాదృచ్ఛికమే. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఈరోజు ఈ కొత్త బాధ్యతను నాకు అప్పగించారు. రాబోయే 25 ఏండ్లలో దేశం తన దార్శనికతను పూర్తి స్థాయిలో సాకారం చేసుకోవడంలో నిమగమై ఉన్న చారిత్రక సమయంలో ఈ బాధ్యతను అప్పగించడం నా గొప్ప అదృష్టం. స్వతంత్ర దేశంలో జన్మించిన దేశానికి మొదటి రాష్ట్రపతిని కూడా నేనే. స్వతంత్ర పౌరుల నుంచి మన స్వాతంత్ర సమరయోధుల అంచనాలను నెరవేర్చడానికి ఈ అమృతకాల్‌లో మనం వేగంగా పని చేయాలి.కర్తవ్య మార్గాన్ని అనుసరిస్తూ, మన సమిష్టి కృషితో దేశ ఉజ్వల భవిష్యత్తు వైపు కొత్త అభివృద్ధి ప్రయాణం చేపట్టాలి. నేడు (జులై 26న) కార్గిల్ విజరు దివస్‌ని జరుపుకుంటాం. అది దేశ సాయుధ దళాల ధైర్యసాహసాలు, సంయమనానికి ప్రతీక. నేను దేశంలోని సాయుధ దళాలకు, పౌరులందరికీ ముందస్తుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అని అన్నారు.
రాష్ట్రపతి అవ్వటం ప్రజాస్వామ్య దేశం గొప్పతనం
''దేశంలోని తూర్పు ప్రాంతంలోని ఒడిశాలోని ఒక చిన్న గిరిజన గ్రామం నుంచి నా జీవిత ప్రయాణాన్ని ప్రారంభించాను. నేను వచ్చిన నేపథ్యం నుంచి ప్రాథమిక విద్యను పొందడం నాకు ఒక కల లాంటిది. అయితే ఎన్నో అడ్డంకులు ఎదురైనా నా సంకల్పం దృఢంగా ఉండి కాలేజీకి వెళ్లిన మా ఊరి మొదటి కూతురిని అయ్యాను. నేను గిరిజన సమాజానికి చెందినవాడిని. వార్డ్ కౌన్సిలర్‌గా పని చేయడం నుంచి భారత రాష్ట్రపతి వరకు ఎదిగే అవకాశం నాకు లభించింది. ఇది ప్రజాస్వామ్యానికి తల్లి అయిన దేశం గొప్పతనం. మారుమూల గిరిజన ప్రాంతంలో నిరుపేద ఇంట్లో పుట్టిన కూతురు, దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ స్థానానికి చేరుకోవడం మన ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం. నేను రాష్ట్రపతి పదవిని సాధించడం నా వ్యక్తిగత విజయం కాదు. దేశంలోని ప్రతి పేద వ్యక్తి సాధించిన ఘనత. దేశంలోని పేదలు కలలు కంటూ వాటిని కూడా నెరవేర్చగలరనడానికి నా ఎన్నికలే నిదర్శనం. శతాబ్దాలుగా నిరాదరణకు గురైన వారు, అభివృద్ధి ఫలాలు అందకుండా పోతున్న వారు, పేదలు, అణగారిన, వెనుకబడిన, గిరిజనులు నాలో తమ ప్రతిబింబాన్ని చూడడం నాకు చాలా సంతృప్తిని కలిగించే విషయం. నా ఎన్నికకు దేశంలోని పేదల ఆశీస్సులు ఉన్నాయి. ఇది దేశంలోని కోట్లాది మంది మహిళల కలలు, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. నా ఎన్నిక కొత్త బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్న నేటి యువత ధైర్యాన్ని కూడా చూపుతుంది. అటువంటి ప్రగతిశీల దేశానికి నాయకత్వం వహిస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. ఈ హౌదాలో పని చేస్తున్నప్పుడు వారి ప్రయోజనాలే నాకు ప్రధానమని, నేను తోటి పౌరులందరికీ ముఖ్యంగా దేశంలోని యువత, మహిళలకు హామీ ఇస్తున్నాను'' అని అన్నారు.
ప్రజాస్వామ్య ఆదర్శాలు ఎల్లప్పుడూ నా శక్తికి మూలం
''ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య ప్రతిష్టను నిరంతరం బలోపేతం చేసిన రాష్ట్రపతి పదవికి సంబంధించిన గొప్ప వారసత్వం నా ముందు ఉంది. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నుంచి రామ్‌నాథ్ కోవింద్ వరకు ఈ పదవిని అలంకరించారు. ఈ పదవితో పాటు, ఈ గొప్ప సంప్రదాయానికి ప్రాతినిధ్యం వహించే బాధ్యతను కూడా దేశం నాకు అప్పగించింది. రాజ్యాంగం వెలుగులో నేను నా బాధ్యతలను అత్యంత చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను. దేశం, పౌరులందరి ప్రజాస్వామ్య,సాంస్కృతిక ఆదర్శాలు ఎల్లప్పుడూ నా శక్తికి మూలం'' అని అన్నారు.
దేశాభిమానాన్ని నాటి మహానీయులు నేర్పారు
''స్వాతంత్ర పోరాటం భారతదేశం కొత్త ప్రయాణానికి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. పోరాటాలు, త్యాగాల నిరంతర ప్రవాహమైన మన స్వాతంత్ర పోరాటం, స్వతంత్ర భారతదేశానికి అనేక ఆదర్శాలను, అవకాశాలను పెంపొందించింది. మహాత్మా గాంధీ స్వరాజ్యం, స్వదేశీ, స్వచ్ఛత, సత్యాగ్రహాలను ఆశ్రయించి భారతీయ సాంస్కృతిక ఆదర్శాలను సాకారం చేసుకునేందుకు మార్గం చూపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, సర్దార్ పటేల్, బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్ వంటి అసంఖ్యాక వ్యక్తులు దేశాభిమానాన్ని ప్రధానం చేయాలని మనకు నేర్పించారు. రాణి లక్ష్మీ బాయి, రాణి వేలు నాచియార్, రాణి గైడిన్లియు, రాణి చెన్నమ్మ వంటి అనేక మంది ధైర్య మహిళా ఐకాన్లు దేశాన్ని రక్షించడంలోనూ, నిర్మించడంలోనూ మహిళా శక్తి పాత్రను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు'' అని తెలిపారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏకాభిప్రాయంతో ప్రగతి
'' పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంగా 75 ఏండ్ల పాటు భాగస్వామ్యం, ఏకాభిప్రాయంతో ప్రగతి సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లింది. వైవిధ్యాలతో నిండిన దేశంలో అనేక భాషలు, మతాలు, వర్గాలు, ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు, ఆచార వ్యవహారాలను అవలంబిస్తూ 'ఏక్ భారత్ - శ్రేష్ట భారత్' నిర్మాణంలో నిమగమై ఉన్నాం. నా దేశం ప్రేరణ పొంది, కొత్త ఆలోచనతో ఈ కొత్త శకాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నట్లు చూస్తున్నాను. దేశం ప్రతి రంగంలోనూ అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని జోడిస్తోందన్నారు.
జీ20 దేశాలకు ఆతిథ్యం
''ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, సరఫరా గొలుసు సులభతరం, శాంతిని నిర్ధారించడం కోసం అంతర్జాతీయ సమాజం భారతదేశం నుంచి చాలా ఆశలు పెట్టుకుంది. భారతదేశం జీ-20 దేశాలకు ఆతిథ్యం ఇవ్వబోతుంది. ప్రపంచంలోని ఇరవై పెద్ద దేశాలు ప్రపంచ సమస్యలపై మేధోమథనం చేస్తాయి. మన దేశంలో ఈ మేధోమథనం నుంచి వెలువడే తీర్మానాలు, విధానాలు రాబోయే దశాబ్దాల దిశను నిర్దేశిస్తాయని నేను కచ్చితంగా అనుకుంటున్నాను'' అని తెలిపారు. ''సంతాల్ విప్లవం, పైకా విప్లవం నుంచి కోల్ విప్లవం, భిల్ విప్లవం వరకు స్వాతంత్ర పోరాటంలో గిరిజనుల సహకారాన్ని బలోపేతం చేశాయి. సామాజిక అభ్యున్నతి, దేశభక్తి కోసం 'ధర్తి ఆబా' భగవాన్ బిర్సా ముండా త్యాగం నుంచి మేం ప్రేరణ పొందాం. స్వతంత్ర పోరాటంలో గిరిజన వర్గాల పాత్రకు అంకితం చేస్తూ దేశవ్యాప్తంగా అనేక మ్యూజియంలు నిర్మిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను'' అని అన్నారు.
నాలుగో పారిశ్రామిక విప్లవానికి సిద్ధం
''దేశ యువతలో ఉన్న ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నేను నిశితంగా గమనించాను. దేశంలోని యువత అభివృద్ధి చెందినప్పుడు, వారు తమ స్వంత విధిని సృష్టించుకోవడమే కాకుండా దేశ భవిష్యత్తును కూడా రూపొందిస్తారని మన వాజ్‌పేరు అన్నారు. అది నిజమవడాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. 'వోకల్ ఫర్ లోకల్' నుంచి 'డిజిటల్ ఇండియా' వరకు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్న నేటి దేశం, ప్రపంచంతో కలిసి అడుగులు వేస్తూ నాలుగో పారిశ్రామిక విప్లవానికి సిద్ధమైంది. దేశంలోని యువత రికార్డు స్థాయిలో స్టార్టప్‌లను సృష్టించడంలో, అనేక ఆవిష్కరణలలో సుదూర ప్రాంతాలలో డిజిటల్ సాంకేతికతను స్వీకరించడంలో పెద్ద పాత్రను కలిగి ఉంది'' అని తెలిపారు.
దేశ నిర్మాణంలో మహిళలు
''గత కొన్నేళ్లుగా మహిళా సాధికారత కోసం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన విధానాల కారణంగా దేశంలో కొత్త శక్తి నింపబడింది. సోదరీమణులు, కుమార్తెలందరూ మరింత శక్తివంతం కావాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా వారు దేశ నిర్మాణానికి సంబంధించిన ప్రతి రంగంలో తమ సహకారాన్ని పెంచుతూనే ఉంటారు. మీరు మీ భవిష్యత్తును నిర్మించుకోవడమే కాకుండా భావి భారతదేశానికి పునాది వేస్తున్నారని మన దేశ యువతకు నేను చెప్పాలనుకుంటున్నాను. దేశ రాష్ట్రపతిగా మీకు నా పూర్తి సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తాను'' అని స్పష్టం చేశారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే మార్గనిర్దేశం
వృద్ధి, పురోగమనం అంటే నిరంతరం ముందుకు సాగడం. అయితే గతం గురించి అవగాహన కూడా అంతే ముఖ్యం. దేశ పురాతన సంప్రదాయాలు, స్థిరమైన జీవనశైలి పాత్ర మరింత ముఖ్యమైనది.
వేల ఏండ్లుగా ప్రకృతితో మమేకమై జీవించే ఆ గిరిజన సంప్రదాయంలో పుట్టాను. నా జీవితంలో అడవులు, నీటి వనరుల ప్రాముఖ్యతను గ్రహించాను. మేం ప్రకృతి నుంచి అవసరమైన వనరులను తీసుకుంటాం. ప్రకృతికి సమానమైన భక్తితో సేవ చేస్తాం. ఈ సున్నితత్వం నేడు ప్రపంచ ఆవశ్యకతగా మారింది. పర్యావరణ పరిరక్షణలో భారతదేశం ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను'' అని అన్నారు.
ఏకమై అంకితభావంతో ముందుకు
లోక కళ్యాణం కోసం పని చేయడం తన ప్రయోజనాల కంటే చాలా గొప్పది. ఈ లోక కళ్యాణ స్ఫూర్తితో మీరందరూ నాపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా జీవించడానికి పూర్తి భక్తి, అంకితభావంతో పని చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఉజ్వలమైన, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడానికి మనమందరం ఏకమై అంకిత భావంతో కర్తవ్య మార్గంలో ముందుకు సాగుదాం'' అని అన్నారు.