Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల హక్కులకు తీరని అన్యాయం
న్యూఢిల్లీ : 'కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన' పేరుతో మోడీ సర్కార్ ప్రయివేటీకరణను వేగవంతం చేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మకానికి పెడుతోంది. ప్రజల నుంచి వ్యతిరేకత, ఆగ్రహం రాకుండా బీజేపీ అనుకూల మీడియా సంస్కరణల పేరు తగిలించి తెగ ప్రచారం కల్పిస్తోంది. నేడు దేశంలో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చడానికి మోడీ సర్కార్ అనుసరిస్తున్న ఆ విధానాలే కారణమని వివిధ రంగాల నిపుణులు తేల్చిచెప్పారు. అంతేగాక దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, వికలాంగులు రిజర్వేషన్లు కోల్పోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉపాధి, ఉద్యోగరంగాల్లో ముఖ్యంగా వికలాంగులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఒక వాణిజ్య సంస్థగా వ్యవహరిస్తోందని, లాభాలే ప్రాతిపదికగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం ప్రజాస్వామ్య పాలన అనిపించుకోదని నిపుణులు చెబుతున్నారు. వ్యయ నియంత్రణ చర్యల ద్వారా కార్మికులు, ఉద్యోగుల జీతభత్యాల భారాన్ని తగ్గించుకుంటోందని, అందుకోసమే ప్రయివేటీకరణను మోడీ సర్కార్ ఎంచుకుందని తెలుస్తోంది. వికలాంగుల చట్టం-2016 ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 4శాతం వికలాంగులకు కేటాయించారు. మోడీ సర్కార్ ప్రయివేటీకరణ కారణంగా చట్టం అమలు, వికలాంగుల హక్కులు పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉపాధి కల్పనలో ప్రయివేటు కంపెనీలు అభ్యర్థుల మెరిట్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగుల హక్కులకు, అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వదు. దాంతో సమాజంలో అణగారిన వర్గాలు, వికలాంగులు సమానత్వానికి దూరమవుతారు. అనేక అవకాశాలు కోల్పోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.