Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత నాలుగేండ్లలో రూ.24వేల కోట్ల నుంచి రూ.242కోట్లకు తగ్గింపు
- ఒక్క 2021-22లోనే 11,654కోట్లు ఎగనామం
- కోట్లాది మంది లబ్దిదారులకు దక్కాల్సిన ప్రయోజనంపై దెబ్బ
న్యూఢిల్లీ : వంటగ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ రూపంలో అందే రెండు..మూడు వందల రూపాయల్ని సైతం మోడీ సర్కార్ లాగేసుకుంది. గత నాలుగేండ్లుగా (2017-18 నుంచి) ఒక వ్యూహం ప్రకారం సబ్సిడీలకు కోతలు విధిస్తున్న కేంద్రం, నాలుగేండ్లలో రూ.23,464కోట్లు మిగుల్చుకుంది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది లబ్దిదారులకు చేరాల్సిన ఈ మొత్తానికి ఎగనామం పెట్టింది. ఒక్క 2021-22లో వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీని రద్దు చేయటం ద్వారా కేంద్ర ఖజానాకు రూ.11,654కోట్లు మిగిలాయని కేంద్ర చమురు, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామెశ్వర్ తెలి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. ప్రతి సిలిండర్‌పై సుమారుగా రూ.350కిపైగా వచ్చే సబ్సిడీని కేంద్రం గత ఏడాది రూ.40కు తీసుకొచ్చింది. ఈ ఏడాది అది కూడా రద్దు చేసింది. సబ్సిడీ ఎత్తేయటం వల్ల ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.11,654 కోట్ల రూపాయల్ని కేంద్రం ఆదా చేసిందని పార్లమెంట్లో కేంద్రం ఘనంగా చెప్పుకుంది. సబ్సిడీని పూర్తిగా ఎత్తేయటం ద్వారా వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని, ఉజ్వల్ పథకం కింద జారీ అయిన కనెక్షన్లకు మాత్రం రూ.242కోట్లు విడుదల చేశామని కేంద్రం తెలిసింది. 2020-21లో వంటగ్యాస్ సబ్సిడీ కింద కేంద్రం రూ.11,896కోట్లు ఖర్చు చేసిందని ఒక ప్రశ్నకు సమాధానంగా రామేశ్వర్ తెలి గణాంకాలు వెల్లడించారు.
ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, ఎల్పీజీ సబ్సిడీ మొత్తం 2017-18లో రూ.23,464కోట్లుగా ఉంది. 2019-20లో రూ.24,172కోట్లకు చేరుకుంది. దీంట్లో 50శాతం కోత పెట్టాలని...2020-21లో నిర్ణయించారు. దాంతో సబ్సిడీల వ్యయం రూ.11,896కోట్లకు తగ్గింది. ఇది చివరికి 2021-22లో రూ.242కు పరిమితమైంది. ఇది కూడా ఉజ్వల్ పథకం కింద ఉన్న కనెక్షన్లకు ఇచ్చిన సబ్సిడీ మొత్తం. సబ్సిడీతో కూడిన సిలిండర్ ధర 2019లో రూ.706 ఉండగా, సబ్సిడీ పూర్తిగా ఎత్తేసిన కేంద్రం సిలిండర్ ధరను రూ.1105కు పెంచింది.