Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో కొత్త తరహా మోసం
- ఐదుగురిపై సీబీఐ కేసు ..నలుగురి అరెస్టు
న్యూఢిల్లీ : దేశంలో కొత్త తరహా మోసం ఒకటి వెలుగు చూసింది. రూ. 100 కోట్లకు రాజ్యసభ సీటు, గవర్నర్, ప్రభుత్వ సంస్థల్లో చైర్‌పర్సన్‌గా నియమిస్తామనే నకిలీ హామీలతో ప్రజల్ని మోసం చేస్తున్న విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కనుగొంది. ఈ మోసానికి పాల్పడిన ఐదుగురిపై సీబీఐ సోమవారం కేసు నమోదు చేసింది. ఈ ఐదుగురిలో నలుగుర్ని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. నిందితుల్ని మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కమలాకర్ ప్రేమ్‌కుమార్ బంద్గర్, ఢిల్లీకి చెందిన మహేంద్ర పాల్ అరోరా, మహమ్మద్ అయిజ్ఖాన్, ఘజియాబాద్‌కు చెందిన అభిషేక్ బూర, కర్నా టకలోని బెల్గాంకు చెందిన రవీంద్ర విఠల్ నాయక్‌గా గుర్తించారు. వీరిలో అయిజ్ఖాన్ మినహా మిగిలిన నలుగుర్ని అరెస్టు చేశారు. సీబీఐకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన బంద్గర్ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న నటిస్తూ రాజ్యసభ సీట్లు, గవర్నర్, ప్రభుత్వ సంస్థలో నియామకాలు జరుపుతామని ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఇందుకోసం మిగిలిన నిందితులతో కలిసి కుట్ర పన్నుతున్నాడు. డబ్బు తీసుకుని వస్తే ఏ పనైనా చేసి పెడతామని ప్రజల్లో ప్రచారం చేస్తుంటారు. ప్రజల్ని మోసం చేయడానికి వీరు తమ సంభాషణల్లో సీనియర్ అధికారులు, ప్రముఖ రాజకీయ నాయుకుల పేర్లు తరచుగా ఉపయోగిస్తుంటారు. కొంతమంది పోలీస్ అధికారులపై కూడా బంద్గర్ బెదిరింపులకు పాల్పడినట్టు సీబీఐ గుర్తించింది.