Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీల పెన్షన్, గ్రాట్యుటీ తదితర అంశాలు పరిష్కరించాలి : అంగన్వాడీ మహాపడావ్‌లో హేమలత, తపన్ సేన్
- నాలుగు రోజుల పాటు మహాపడావ్
- కదంతొక్కిన వేలాది మంది అంగన్ వాడీలు
- ఏఐకేఎస్ నేతల మద్దతు
- సీపీఐ(ఎం) ఎంపీల సంఘీభావం
న్యూఢిల్లీ: అంగన్వాడీల పెన్షన్, గ్రాట్యుటీతోపాటు కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేయాలని సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తపన్ సేన్, హేమలత పిలుపు ఇచ్చారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (ఎఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్) ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరిగే ''అంగన్ వాడీ అధికార్ మహాపడావ్'' మంగళవారం జంతర్ మంతర్‌లో ప్రారంభమైంది. వేలాది మంది అంగన్ వాడీ వర్కర్స్, హెల్పర్స్ కందం తొక్కారు. కనీస వేతనాలు, పెన్షన్, సామాజిక భద్రతా ప్రయోజనాలతో కార్మికులుగా గుర్తించాలని
డిమాండ్ చేశారు. దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ''అమృత్ మహౌత్సవ్''గా జరుపుకుంటున్న వేళ, వేలాది మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధనం కోసం గొంతెత్తారు. ఈ మహాపడావ్‌కు ఎఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ జాతీయ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర స్థాయి యూనియన్ల అధ్యక్షులతో కూడిన అధ్యక్ష వర్గం నిర్వహించింది. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా రైతుల తరపున సంఘీభావం తెలిపారు. అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకుల డిమాండ్లకు పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. సీపీఐ(ఎం) ఎంపీలు ఎలమారం కరీం, వి.శివదాసన్ సంఘీభావం తెలిపారు. పార్లమెంట్లో అంగన్వాడీ ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ మహాపడవ్ను ప్రారంభించి కేంద్ర సమాఖ్య తరపున సంపూర్ణ మద్దతు తెలిపారు. అంగన్ వాడీ వర్కర్లను కార్మికులుగా గుర్తించటం లేదని, వాలంటీర్లు అంటున్నారని పేర్కొన్నారు. 45, 46 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌ల సిఫారసులను అమలు చేయాలనీ, తద్వారా గ్రాట్యూటీపై సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్ వాడీలకు మెరుగైన పరిస్థితులు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీతో సహా పెన్షన్, సామాజిక భద్రతను అందించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ కోసం తగిన బడ్జెట్ కేటాయించాలన్నారు. కార్మిక చట్టాల పరిధిలో స్కీమ్ వర్కర్లను చేర్చాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ అధ్యక్షురాలు కె.హేమలత మాట్లాడుతూ పెన్షన్, గ్రాట్యుటీతోపాటు కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆరేండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు విద్య, సంరక్షణ హక్కును నిర్ధారించడానికి చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను నోడల్ ఏజెన్సీగా చేయాలని, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు సరైన శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఏ రూపంలోనూ ఐసీడీఎస్‌ను ప్రయివేటీకరణ చేయలేదని, అంగన్వాడీలలో కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రమేయం ఉండకూడదని అన్నారు.
ఎఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ ప్రధాన కార్యదర్శి ఎఆర్ సింధు మహాపడావ్ లక్ష్యాన్ని వివరిస్తూ తమ హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని 27 లక్షల మందికి పైగా అంగన్వాడీ వర్క, సహాయకులు 8 కోట్ల మంది ఆరేండ్లలోపు పిల్లలకు పోషకాహారం, ఆరోగ్యం, ప్రాథమిక సేవలను అందజేస్తున్నాని సింధూ తెలిపారు. సమ్మెలో పాల్గొన్నందుకు చట్టవిరుద్ధంగా తొలగించబడిన హర్యానాలో 975 మంది కార్మికులు, సహాయకులను, ఢిల్లీలో 991 మంది కార్మికులు, సహాయకులను వెంటనే తిరిగి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని, ఢిల్లీలో విధించిన ఎస్మాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలను అరికట్టడానికి, పోరాటాలను అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు 24 మార్చి 2022 నాటి ఆదేశాన్నికేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ఐలు ప్రధాన కార్యదర్శి అంజలి భరద్వాజ్ గ్రాట్యుటీ హక్కుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలను వివరించారు. అంగన్వాడీల పోరాటం కేవలం వారి హక్కుల కోసం మాత్రమే కాదని, భారతదేశంలోని పిల్లల కోసం, ఆరోగ్యకరమైన, విద్యావంతులైన దేశం కోసమని అన్నారు. అధ్యక్షవర్గం తరపున ఉషా రాణి ధన్యవాదాలు తెలుపుతూ సుదీర్ఘ పోరాటానికి ఉత్సాహం నింపారు. తొలిరోజు మహాపడవ్కు ప్రేసన్న కుమారి (కేరళ), హర్జీత్ కౌర్ (పంజాబ్), సునంద (కర్నాటక), అరుణ్ మెహతా (గుజరాత్ ), శాంటీ సోరెన్ (జార్ఖండ్), శకుంతల (హర్యానా), హనీఫా(కాశ్మీర్), సురైయ (ఆంధ్రప్రదేశ్) నాయకులు ప్రసంగించారు. వివిధ రాష్ట్రాల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అసోం వరకు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను సాధించి తీరాలని నిర్ణయించుకున్నారు.