Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 మంది మృతి
- మద్యనిషేధం ఉన్నా...ఆగని కల్తీ
న్యూఢిల్లీ : గుజరాత్లో కల్తీ మద్యం 30మంది ప్రాణాల్ని బలితీసుకున్నది. మద్యంలో మిథనాల్ రసాయనం ఎక్కువ మొత్తంలో ఉండటం వల్లే ప్రాణనష్టం భారీగా ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మద్యం తయారు, అమ్మకం, మద్యం తీసుకోవటం గుజరాత్లో నిషిద్ధం. అయితే దీనిపై అక్కడి బీజేపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం లేదని, అనేక గ్రామాల్లో కల్తీ మద్యానికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవటం లేదని ప్రతిపక్షాలు గతకొన్నాండ్లుగా విమర్శిస్తున్నారు.
అసలేం జరిగింది?
రోజిద్ గ్రామంలోని సోమవారం పలు గ్రామాల ప్రజలు మద్యం సేవించేందుకు వచ్చారు. మద్యం సేవించిన కొద్ది గంటల తర్వాత ఒక్కొక్కరూ నోటినుంచి నురగకక్కుతూ కిందపడిపోయారు. ఇలా చూస్తుండగానే కొందరు అక్కడే చనిపోయారు. మొత్తం 30మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలంలో సోమవారం 10 మంది, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 20 మంది మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సహా 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తును సిట్ ప్రారంభించింది. ఈ ఘటన బాధాకరమని గుజరాత్ మంత్రి విను మరోడియా అన్నారు. నిషేధం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మద్యం ఎలా, ఎవరు విక్రయిస్తున్నారనే దానిపై విచారణ జరుపతున్నామని తెలిపారు. బాధ్యులైన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.