Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవోదయ స్కూల్స్‌లో 3వేలకుపైగా : కేంద్రం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 12వేలకు పైగా టీచింగ్ ఉద్యోగ ఖాళీలున్నాయని, 9వేల మందికిపైగా కాంట్రాక్ట్ టీచర్స్ పనిచేస్తున్నారని కేంద్రం వెల్లడించింది. టీచింగ్ ఉద్యోగ ఖాళీలు అత్యధికంగా తమిళనాడు (1162), మధ్యప్రదేశ్ (1066), కర్నాటక (1006) రాష్ట్రాల్లో ఉన్నాయని తెలిపింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి పై గణాంకాల్ని విడుదల చేశారు. ఈ వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నవోదయ విద్యాలయాల్లో 3156 టీచింగ్ ఉద్యోగ ఖాళీలున్నాయి. అత్యధికంగా జార్ఖాండ్‌లో 230, అరుణాచల్‌ప్రదేశ్, అసోంలలో 215 ఖాళీలున్నాయి.ఉద్యోగ ఖాళీల్లో రిజర్వ్డ్ కేటగిరీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
2021నాటికి కేంద్రీయ విద్యాలయాల్లో ఓబీసీ కేటగిరిలో 457 పోస్టులు, ఎస్సీ-337 పోస్టులు ఖాళీలు భర్తీ చేయాల్సి వుంది. ఈడబ్ల్యూఎస్-163, ఎస్టీ-168 పోస్టులు ఉన్నాయి. నవోదయ విద్యాలయాల్లో ఈడబ్ల్యూఎస్-194, ఓబీసీ-676, ఎస్సీ-470, ఎస్టీ-234 టీచింగ్ ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి.
మంగళవారం లోక్‌సభలో అన్నపూర్ణాదేవి మాట్లాడుతూ ''12,044 టీచింగ్ ఉద్యోగాలు, నాన్-టీచింగ్ 1332 ఉద్యోగ ఖాళీలు కేంద్రీయ విద్యాలయాల్లో ఉన్నాయి. బదిలీలు, రిటైర్మెంట్స్ వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరం జరుగుతోంది. కేంద్రీయ విద్యాలయాల్లో అవసరాలమేరకు కాంట్రాక్ట్ టీచర్స్‌ను నియమిస్తున్నాం. ప్రస్తుతం 9161 మంది కాంట్రాక్ట్ టీచర్స్ కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేస్తున్నారు'' అని తెలిపారు. మూడు రాష్ట్రాల్లో వెయ్యికిపైగా ఉద్యోగ ఖాళీలు, 600కుపైగా ఉద్యోగ ఖాళీలున్న రాష్ట్రాలు ఏడున్నాయి. ఇందులో అత్యధికంగా పశ్చిమబెంగాల్లో 964, ఒడిషాలో 886, మహారాష్ట్రలో 705 ఖాళీలు ఏర్పడ్డాయి.