Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం అనుమతించటం లేదు
- రాష్ట్రపతికి ప్రతిపక్షాలు లేఖ
న్యూఢిలీ : ప్రభుత్వం మొండితనంపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రతిపక్షాలు కోరాయి. ఈ మేరకు మంగళవారం పది ప్రతిపక్షాలు సంయుక్తంగా రాష్ట్రపతికి లేఖ రాశాయి. ముందుగా, మీరు దేశానికి 15వ రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు తమ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నామని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు. 'దురదృష్టవశాత్తూ ధరల పెరుగుదల, నిత్యావసర ఆహార వస్తువులపై జిఎస్టి రేట్ల పెంపుదల వంటి ముఖ్యమైన అంశాలపై అత్యవసర చర్చకు ప్రభుత్వం మొండిగా నిరాకరించడం వల్ల పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇప్పటివరకు పూర్తిగా నిలిచిపోయాయి. అటువంటి అత్యవసర చర్చ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈసారి ప్రభుత్వం మొండిగా ఉంది. చర్చను అనుమతించలేదు'' అని విమర్శించాయి. ''మోడీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా క్రమబద్ధమైన ప్రతీకార చర్యలో భాగంగా దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాం. చట్టాన్ని నిష్పాక్షపాతంగా అమలు చేయాలి. కానీ ప్రస్తుతం దీనిని ఏకపక్షంగా, ఎంపిక చేసి, అనేక ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులకు వ్యతిరేకంగా ఎటువంటి సమర్థన లేకుండా ఉపయోగిస్తున్నారు. ఈ చర్యల ఏకైక లక్ష్యం తమ ప్రతిష్టలను నాశనం చేయడమే. సైద్ధాంతికంగా, రాజకీయంగా బీజేపీతో పోరాడుతున్న శక్తులను బలహీనపరచడమే వారి లక్ష్యం. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, జీవనోపాధి నష్టం, జీవితంలో పెరుగుతున్న అభద్రతాభావం, స్వేచ్ఛ, ఆస్తుల అభద్రతాభావం గురించి దేశ ప్రజల రోజువారీ ఆందోళనల నుంచి వారి దృష్టిని మరల్చడానికే కూడా కేంద్రం ఈ చర్యలకు పాల్పడుతుంది'' అని విమర్శించారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని తాము కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్), శరద్ పవర్ (ఎన్సీపీ), తిరుచ్చి శివ (డీఎంకే), రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), సంజరు సింగ్ (ఆప్), ఎలమారం కరీం (సీపీఐ(ఎం), వైకో (ఎండీఎంకే) తదితరులు ఉన్నారు.
పార్లమెంట్ ఆవరణంలో సస్పెండైన లోక్‌సభ ఎంపీల ధర్నా
లోక్‌సభలో సస్పెండ్‌కు గురైన నలుగురు ఎంపీలు మాణికం ఠాగూర్, టిఎన్ ప్రతాపన్, రమ్య హరిదాస్, ఎస్.జ్వోతి మణి మంగళవారం పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. వారికి కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఎన్పీపీ, డీఎంకే, వామపక్ష పార్టీల ఎంపీలు మద్దతు ఇచ్చారు. టీఎంసీ ఎంపీలు రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో గారో, ఖాసీలను చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.