Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ చరిత్రలో అత్యధిక సభ్యుల సస్పెన్షన్
- వారంలో మిగిలిన రోజులపాటు వర్తింపు
- సీపీఐ(ఎం) 2 ఎంపీలు, టీఆర్ఎస్ 3, సీపీఐ 1, డీఎంకే 6, టీఎంసీ 7
న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి 19 మంది ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ ఈ వారంలో మిగతా రోజులు వర్తిస్తుంది. రాజ్యసభ చరిత్రలోనే ఒకేసారి ఇంత ఎక్కువ మంది సభ్యుల సస్పెన్షన్ ఇదే తొలిసారి. గత నవంబర్‌లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో 12 మంది సభ్యులను సస్పెన్షన్ చేశారు. దాన్ని తిరగరాసి, ఇప్పుడు 19 మంది సభ్యుల సస్పెన్షన్‌తో రాజ్యసభ చరిత్రలోనే అత్యధిక సభ్యుల సస్పెన్షన్ కు గురయ్యారు. ధరలు పెరుగుదల, ఆహార పదార్థాలపై జీఎస్టీ విధింపు వంటి అంశాలపై చర్చ జరపాలని గత ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష ఎంపీల్లో 19 మందిని మంగళవారం సస్పెండ్ చేశారు. 19 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ తీర్మానం ప్రవేశపెట్టారు. దుష్ప్రవర్తన కింద సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తీర్మానాన్ని మూజువాణి ఓటు ఆమోదించి, సభ్యులను సభ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. రాజ్యసభ ప్రారంభం కాగానే చైర్మైన్ ఎం.వెంకయ్య నాయుడుతో పాటు ఎంపీలు 23వ కార్గిల్ దివాస్ సందర్భంగా సైనికులకు నివాళులర్పించి, మౌనం పాటించారు. అనంతరం చైర్మెన్ వివిధ అంశాలపై ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులను తిరస్కరించారు. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. ప్లకార్డు చేబూని చర్చ జరపాలని డిమాండ్ చేశారు. వెంటనే చైర్మెన్ సభను గంట పాటు వాయిదా వేశారు. దీంతో ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు ప్రారంభమైన సభలో డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రశ్నోత్తరాలను నిర్వహించేందుకు ప్రయత్నించగా, ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు పట్టుకొని వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభలో ప్లకార్డులు ప్రదర్శించకూడదని, సభ నిబంధనలు పాటించాలని, సభ్యులంతా తమ స్థానాల్లోకి వెళ్లాలని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను కొసాగించారు. దీంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. దీంతో సభ నాలుగు నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే 41 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాలు జరిగి, మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తరువాత ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన నడుమ ఉపా బిల్లుపై చర్చ జరిగింది. అయితే ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో హౌరెత్తడంతో సభలో తీవ్రగందరగోళం నెలకొంది. డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ జోక్యం చేసుకొని, సభకు అంతరాయం కలిగించడం సభా నిబంధనల ఉల్లంఘన అనీ, సభ్యులు దీన్ని ఆపకపోతే రూల్ నెంబర్ 256ను ప్రయోగిస్తానని హెచ్చరించారు. కొద్ది సేపటికే సభ నుంచి 19 మంది ప్రతిపక్షసభ్యులను సస్పెండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ చదివి వినిపించారు. అయితే సస్పెన్షన్ తీర్మానంపై ప్రతిపక్షాలు ఓటింగ్‌కు డిమాండ్ చేశాయి. దీనికి డిప్యూటీ చైర్మెన్ సభ్యులంతా తమ స్థానాల్లోకి వెళ్తే ఓటింగ్ నిర్వహిస్తానని, హౌస్ అర్డర్‌లో లేకపోతే ఎలా ఓటింగ్ నిర్వహిస్తానని అన్నారు. సభ్యులు వెల్‌లోనే ఆందోళన చేస్తూ ఓటింగ్‌కు డిమాండ్ చేశారు. దీంతో వెంటనే మూజువాణి ఓటుతో తీర్మానాన్ని ఆమోదించి, సభను 15 నిమిషాలు పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్యానల్ చైర్మెన్‌గా భూభనేశ్వర్ కలిటా వ్యవహరించారు.
లోక్‌సభలో...
మరోవైపు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఎంపీలు కార్గిల్ దివాస్ సందర్భంగా సైనికులకు నివాళుల్పించారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు పెరిగిన ధరలపై చర్చ జరపాలని కోరారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ వాయిదా తీర్మానాలు ఇచ్చారని, ప్రశ్నోత్తరాలు అయిన తరువాత వాటిపై చర్చిద్దామని అన్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని నినాదాల హౌరెత్తించారు. పది నిమిషాల పాటు జరిగిన సభను 11:45 గంటలకు వాయిదా వేశారు.