Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్గమధ్యలోనే కాంగ్రెస్ ఎంపీలను అడ్డుకున్న పోలీసులు
- రోడ్డుపైనే బైటాయించిన రాహుల్, ఎంపీలు ..అరెస్టు
న్యూఢిలీ: పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు కాంగ్రెస్ ఎంపీలు మార్చ్ నిర్వహించారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్ల కుండా మార్గ మధ్యలోనే విజరు చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీతో సహా ఎంపిలందరు రోడ్డుపైనే బైటాయించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీని పోలీసులు చుట్టుముట్టారు. సుమారు 30 నిమిషాల పాటు ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఆయన వద్దకు కాంగ్రెస్ నేతలు, మీడియా వెళ్ల కుండా ఆపారు. రాహుల్ గాంధీతో పాటు దాదాపు 50 మంది కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీని ఎత్తుకెళ్లి బస్సు ఎక్కించారు. అప్పటికే ఆయనతో ఉన్న పలువురు ఎంపీలను బస్సు ఎక్కించారు. అక్కడ నుంచి ఎంపీలందరినీ కింగ్స్‌వే పోలీస్ డిటెన్షన్ క్యాంపునకు తరలించారు. అక్కడే కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ మేధోమథనం నిర్వహించారు. ధరల పెరుగుదల, అగ్నిపథ్, ఆహార పదార్ధాలపై జీఎస్టీ విధింపు, జాతీయ భద్రత, రూపాయి పతనం తదితర అంశాలపై అక్కడ చర్చించారు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌధరి, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, దిగ్విజరు సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర నేతలంతా ఈ మేధోమథనంలో పాల్గొన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, రంజీత్ రంజన్, కెసి వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కె. సురేశ్‌లను సైతం అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపిన ఎంపీలను అదుపులోకి తీసుకున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశం పోలీస్ రాజ్యంగా మారిందని, ద్రవ్యోల్బనం, నిరుద్యోగంపై చర్చించేందుకు ప్రభుత్వం అనుమతించటం లేదని అన్నారు. బయట ఆందోళన చేయడానికి అనుమతించటం లేదని, పోలీసులు అరెస్టు చేశారని విమర్శించారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ పోలీసుల సూచనల మేరకే నిరసనల్లో పాల్గొన్నామని, ప్రతిపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టడంలోనే ప్రభుత్వం ఉందని విమర్శించారు. తమ గొంతులను నొక్కేసేందుకు ప్రధాని మోడీ, అమిత్ షాలు చేస్తున్న కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము భయపడమని, తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.