Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా గత ఎనిమిదేండ్లలో 7.22 లక్షల మంది శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని లోక్సభలో కేంద్రం వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు 22 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయని వివరించింది. తెలంగాణ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2014 నుంచి 7,22,311 మంది కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు నిర్వహించిన నియమాక ప్రక్రియలో 22,05,99,238 దరఖాస్తులు వచ్చి చేరినట్టు వివరించారు. ఏడాదివారీగా చూసుకుంటే.. 2014-15లో 1,30,423, 2015-16లో 1,11,807, 2016-17లో 1,01,333, 2017-18లో 76,147, 2018-19లో 38,100, 2019-20లో 1,47,096, 2020-21లో 78,555, 2021-22లో 38,850 మంది ఉద్యోగాలు పొందినట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాగా, మహమ్మారి, లాక్డౌన్లతో ప్రభావితమైన 2020-21, 2021-22 ఏడాదుల కంటే 2018-19లో అత్యల్ప నియామకాలు జరగటం గమనార్హం. ఈ సమయంలో 5.08 కోట్ల దరఖాస్తులు వచ్చి చేరాయి. దేశంలోని యువతకు ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు.. అందులో విఫలమైందని రాజకీయ విశ్లేషకులు ఆరోపించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత సంఖ్య ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.