Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ చట్టం కింద కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాలను (అరెస్టులు, అటాచ్మెంట్, సోదాలు, ఆస్తుల స్వాధీనం) సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది. ఈ చట్టం కింద ఈడీ చేసే అరెస్టులు ఏకపక్షం కాదని తెలిపింది. ఈ మేరకు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లనూ న్యాయస్థానం కొట్టేసింది. పీఎంఎల్ఏలోని కొన్ని నిబంధనలను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏ.ఎం ఖాన్విల్కర్ నేతృత్వంలో జస్టిస్ దినేశ్ మహేశ్వరీ, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం తుది తీర్పును వెలువర్చింది. చట్టంలోని సెక్షన్ 5 రాజ్యాంగబద్దంగా చెల్లుతుందని వివరించింది. ప్రతి కేసులోనూ ఎన్ఫోర్స్మెంట్ కేసు సమాచార నివేదిక (ఈసీఐఆర్)ను సంబంధిత వ్యక్తులకు (నిందితులకు) పంపించటం తప్పనిసరి కాదని తెలిపింది. ఈడీ ఈసీఐఆర్ అనేది పోలీసు ఎఫ్ఐఆర్ కు సమానమని స్పష్టం చేసింది. ఈసీఐఆర్‌ను అధికారికంగా నమోదు చేయాల్సినవసరం లేదని వివరించింది. అరెస్టు చేసే సమయంలో ఈడీ ఆధారాలను వెల్లడిస్తే సరిపోతుందనీ, అది తప్పనిసరి కాదని ధర్మాసనం తెలిపింది.
మనీలాండరింగ్ చట్టంలోని పలు నిబంధనలను సవాలు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీ చిదంబరం, జమ్మూకాశ్మీర్ మాజీముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సహా ఈడీ విచారణను ఎదుర్కొంటున్న పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లను వేశారు.