Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.అభిమన్యు
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం బుధవారం రెండో ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకోసం రూ.1.64లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే నిన్న ప్రకటించిన ఈ పునరుద్ధరణ ప్యాకేజీలో ముఖ్యమైన అంశమేమంటే, బీఎస్ఎన్ఎల్కు 4జీ స్పెక్ట్రమ్‌ను కేటాయించడం. ఇందుకు గానూ రూ.44,993కోట్లను ప్రభుత్వం కేటాయించనుంది. అయితే 2019 అక్టోబరు 23న ప్రకటించిన మొదటి పునరుద్ధరణ ప్యాకేజీలో బీఎస్ఎన్ఎల్కు 4జీ స్పెక్ట్రమ్ కోసం రూ.23,814 కోట్లు కేటాయిస్తామని పేర్కొంది. తిరిగి 2022 ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం చేస్తూ, బీఎస్ఎన్ఎల్ సాంకేతికత ఆధునీకరణ కోసం రూ.44వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు రెండవ పునరుద్ధరణ ప్యాకేజీలో బీఎస్ఎన్ఎల్కు 4జి స్పెక్ట్రమ్ కోసం రూ.44,933 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇవన్నీ మనం కలుపుకున్నట్లైతే, బిఎస్ఎన్ఎల్కు 4జి స్పెక్ట్రమ్ కోసం ఈ ప్రభుత్వం చేసిన కేటాయింపులు లేదా ప్రకటనల మొత్తం ఏకంగా రూ.1,12,807కోట్లు అవుతోంది.
ప్రభుత్వం ఇలా పదే పదే చేస్తున్న ప్రకటనలతో, ఈ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు, సందేశాలు వెళుతున్నాయి. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కోసం ఈ దేశ ప్రజలు చెల్లించిన పన్ను మొత్తాలను పెద్ద మొత్తంలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటువంటి తప్పుడు సంకేతాలను ప్రభుత్వం ఎందుకు పంపిస్తోంది ? ఇది మేం అర్ధం చేసుకోలేకపోతున్నాం. వాస్తవానికి, బీఎస్ఎన్ఎల్కు 4జి స్పెక్ట్రమ్‌ను కేటాయించడం కోసం ప్రజలు చెల్లించే పన్ను మొత్తాల నుండి ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు, ఖర్చు చేయాలని కూడా అనుకోవడం లేదు. ప్రకృతిలో స్పెక్ట్రమ్ అపారంగా అందుబాటులో వుంది. అందులో కొంత భాగాన్ని మాత్రమే ప్రభుత్వం, బిఎస్ఎన్ఎల్కు కేటాయిస్తోంది. అందుకు గానూ ఎవరికీ ఏ డబ్బును కూడా చెల్లించడం లేదు.
2019 అక్టోబరు 23న ప్రభుత్వం ప్రకటించిన మొదటి పునరుద్ధరణ ప్యాకేజీ ఇంకా కాగితాలకే పరిమితమైంది. అయితే ఈ మొదటి ప్యాకేజీ ప్రకారం ప్రభుత్వం చేసిందేమిటంటే, విఆర్ఎస్ ద్వారా దాదాపు 80వేల మంది ఉద్యోగులను తొలగించడమే. 4జి స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తామని చేసిన ప్రకటన కూడా ఇంకా కాగితాలపైనే వుంది. ఈ కారణంగానే 4జి స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్ ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతించలేదు. 4జీ సేవలను ప్రారంభించకుండా బిఎస్‌ఎన్‌ఎల్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం రెండు పెద్ద అవాంతరాలను సృష్టించింది. అందులో మొదటి అవాంతరం-బీఎస్ఎన్ఎల్కి ప్రస్తుతమున్న పరికరాల ఆధునీకరణకు అనుమతిని నిరాకరించడం. బీఎస్ఎన్ఎల్కి దాదాపు 50వేల బిటిఎస్‌లు వున్నాయి. వాటిని సాఫ్ట్వేర్ ఆధునీకరణ ద్వారానే 4జి బిటిఎస్లుగా మార్చగలం. కానీ, ప్రభుత్వం ఇందుకు అనుమతిని నిరాకరిస్తూ వస్తోంది. ఈ ఆధునీకరణను అనుమతించినట్లైతే, కనీసం రెండేండ్ల క్రితమే బీఎస్ఎన్ఎల్ కూడా దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించగలిగి వుండేది. ఇక ప్రభుత్వం సృష్టించిన రెండో అవాంతరం-అంతర్జాతీయ వెండర్ల ద్వారా తమకు కావాల్సిన 4జి పరికరాలను సమకూర్చుకోవడానికి బీఎస్ఎన్ఎల్కు అనుమతిని ఇవ్వకపోవడం. ఎయిర్టెల్, రిలయన్స్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర ప్రయి వేటు టెలికం ఆపరేటర్లు సమకూర్చుకున్నట్లుగా బిఎస్ఎన్ఎల్కు ఆ అవకాశం లేకుండా పోయింది. 2020 మార్చిలో, 50వేల 4జీ బీటీఎస్‌లను సమకూర్చుకోవడానికి బిఎస్ఎన్ఎల్ టెండరును వేసింది. అయితే, ఈ టెండరును రద్దు చేసుకునేలా ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్పై ఒత్తిడి తెచ్చింది. కేవలం భారతదేశ వెండర్ల ద్వారానే బీఎస్ఎన్ఎల్ తన 4జీ పరికరాలను సమకూర్చుకోవాలని ఆదేశించింది. అంతేకానీ అంతర్జాతీయ వెండర్ల ద్వారా సమకూర్చుకోరాదని స్పష్టం చేసింది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్కు 4జీ పరికరాలను సరఫరా చేసేందుకు టిసిఎస్‌ను గుర్తించారు. కానీ, బిఎస్ఎన్ఎల్కు 4జి పరికరాలను సమకూర్యేందుకు అవసరమైన సాంకేతికత తమకుందని ఈనాటి వరకు టిసిఎస్ రుజువు చేసుకోలేకపోయింది.
ఈనాడు, అన్ని ప్రైవేటు టెలికం కంపెనీలు తమ 5జి సేవలను ప్రారంభించేందుకు గానూ, ఇప్పటికే నొకియా, ఎరిక్సన్, శామ్సంగ్ వంటి అంతర్జాతీయ వెండర్లనుండి తమ పరికరాలను సమకూర్చుకోవడానికి చర్యలను తీసుకుంటున్నాయి. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే బీఎస్ఎన్ఎల్కు సమాన అవకాశాలు కల్పించేందుకు తిరస్కరించి, 4జి సేవలను ప్రారంభించకుండా అడ్డుకుంది.
టెలికమ్యూనికేషన్ రంగంలో, సాంకేతికంగా మార్పులు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. బిఎస్ఎన్ఎల్ సకాలంలో తన సాంకేతికతను ఆధునీకరించుకోపోతే ప్రైవేటు టెలికం కంపెనీలతో పోటీ పడడం కష్టం కాగలదు. అన్ని ప్రైవేటు టెలికం కంపెనీలు తమ 5జి సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా వున్నాయి. అయితే, బుధవారం ప్రకటించిన రెండవ పునరుద్ధరణ ప్యాకేజీలోనైనా బీఎస్ఎన్ఎల్ 5జి సేవలను ప్రారంభించడం గురించి కనీసం ప్రస్తావించకపోవడం చాలా నిరాశకు గురి చేసింది.
నాలుగేండ్ల కాలంలో, బీఎస్ఎన్ఎల్కు పెట్టుబడి వ్యయం కింద ప్రభుత్వం రూ.22,471కోట్లను చెల్లిస్తుందని పునరుద్ధరణ ప్యాకేజీలో పేర్కొన్నారు. కానీ ఇక్కడ ఇందుకు సంబంధించి ఒక విషయం చెప్పాల్సి వుంది. ప్రభుత్వమే, బీఎస్ఎన్ఎల్కు రూ.38,540కోట్లను తిరిగి చెల్లించాల్సి వుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ క్రింద ఇచ్చిన పట్టికలో ఇవ్వబడ్డాయి. ఈ మొత్తాన్ని బీఎస్ఎన్ఎల్కి తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ, బీఎస్ఎన్ఎల్ యూనియన్లు, సమాఖ్యలు ఇప్పటికే అనేక ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించాయి. ఆ రకంగా, ఈ రెండో పునరుద్ధరణ ప్యాకేజీ ద్వారా వచ్చే రూ.22,471కోట్లు ప్రభుత్వం, బీఎస్ఎన్ఎల్కు చెల్లించాల్సిన బకాయిల కన్నా చాలా తక్కువ.
ఏటికేడాది, 'పెన్షన్ కంట్రిబ్యూషన్' చెల్లింపుల పేరుతో బీఎస్ఎన్ఎల్ నుంచి ప్రభుత్వం అదనపు మొత్తాలను దోచుకుంటూనే వుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీనివల్ల బిఎస్ఎన్ఎల్ ఆర్థిక స్థితిగతులు ప్రభావితమవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డిఓటి) నుండి బీఎస్ఎన్ఎల్లోకి తీసుకోబడిన ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్‌కు అర్హులు. అందుకోసం బిఎస్ఎన్ఎల్ ప్రతి ఏటా ప్రభుత్వానికి పెన్షన్ కంట్రిబ్యూషన్‌ను చెల్లించాల్సి వుంటుంది. ఈ పెన్షన్ కంట్రిబ్యూషన్‌ను, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల గరిష్ట వేతన స్కేలుపై లెక్కిస్తున్నారు. అదే మిగిలిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అయితే, వాస్తవిక మౌలిక వేతనంపై పెన్షన్ కంట్రిబ్యూషన్‌ను లెక్కిస్తున్నారు. పెన్షన్ కంట్రిబ్యూషన్ పేరుతో బీఎస్ఎన్ఎల్ నుంచి దోచుకుంటున్న ఈ అదనపు మొత్తాలను వెంటనే నిలుపు చేయాలని యూనియన్లు, సమాఖ్యలు నిరంతరాయంగా డిమాండ్ చేస్తూనే వున్నాయి. ఇప్పటికే అధికంగా వసూలు చేసిన మొత్తాలను వెంటనే బీఎస్ఎన్ఎల్కి తిరిగి చెల్లించాలని కోరుతున్నాయి. కానీ, దీని గురించి పునరుద్ధరణ ప్యాకేజీలో ప్రస్తావనే లేదు.
''వయబిలిటీ గ్యాప్ ఫండింగ్''గా బీఎస్ఎన్ఎల్కి ప్రభుత్వం రూ.13,789కోట్లు అందచేస్తుందని పునరుద్ధరణ ప్యాకేజీలో ప్రకటించారు. అసలు ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటి? భారత ప్రభుత్వం తరపున దేశంలోని మారుమూల ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ సేవలను అందిస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ బిఎస్ఎన్ఎల్కు వాణిజ్యపరంగా లాభదాయకం కాదు. అందువల్ల, ఈ సేవలందించడంలో బిఎస్ఎన్ఎల్కి కలిగే నష్టాలను ప్రభుత్వం భర్తీ చేయాల్సి వుంటుంది. 2014-15 నుండి 2019 వరకు మధ్య కాలంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.13,789కోట్లను బీఎస్ఎన్ఎల్కి చెల్లించాల్సి వుంది. బీఎస్ఎన్ఎల్కి చెల్లించాల్సిన ఈ మొత్తం బకాయిగా మారిపోయింది. ఈ మొత్తాలను తిరిగి చెల్లించాలంటూ బీఎస్ఎన్ఎల్ యూనియన్లు, అసోసియేషన్లు పలుసార్లు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాయి. ఇప్పుడు, బిఎస్ఎన్ఎల్కి తిరిగి చెల్లించాల్సిన ఈ మొత్తాన్ని కూడా పునరుద్ధరణ ప్యాకేజీలో భాగంగా చూపించారు. అది సరికాదు.
పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం, మార్కెట్లో జారీ చేసే బాండ్ల ద్వారా రూ.40,399 కోట్లను సమీకరించుకునేందుకు బీఎస్ఎన్ఎల్కు ప్రభుత్వం సావరిన్ గ్యారంటీ ఇస్తుంది. కంపెనీ తన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ఇది దోహదపడుతుంది. అదే సమయంలో, ఈ మొత్తం రూ.40,399కోట్లు, దానిపై వడ్డీ బీఎస్ఎన్ఎల్ తిరిగి చెల్లించాల్సి వుంటుందన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం కూడా సముచితంగానే వుంటుంది. పైగా ప్రజలు చెల్లించే పన్ను మొత్తాలతో దీన్ని చెల్లించడం లేదని కూడా స్పష్టం చేయాల్సి వుంటుంది.
బిఎస్ఎన్ఎల్కు ప్రభుత్వం చెల్లించాల్సిన రిఫండ్ వివరాలు (రూ. కోట్లలో)
1. గ్రామీణ టెలిఫోని కార్యక్రమం విజయవంతం
కోసం వయబిలిటీ గ్యాప్ ఫండ్ 2014-15 ఆర్థిక సంవత్సరం
నుంచి ప్రతి యేటా రు. 1250 కోట్లు చొప్పున
ఇప్పటివరకు చెల్లించాల్సినది 13,789
2 సరెండర్ చేసిన వైమాక్స్ స్పెక్ట్రమ్ పై వడ్డీ కింద 5,850
3. సిడిఎంఎ స్పెక్ట్రమ్‌ను సరెండర్ చేసినందుకు 2,472
4. పింఛను కంట్రిబ్యూషన్ కింద అధికంగా
చెల్లించిన మొత్తం వాపసు కింద 1,996
5. ప్రభుత్వ ప్రాజెక్టులు-ఎన్ఒఎఫ్ఎన్ (భారత్ నెట్) 1,051
6. ఎల్ డబ్ల్యు ఎఫ్ ప్రాజెక్టు 380
7. టెలికమ్యూనికేషన్ శాఖ భవనాలు, ఆఫీసులు,
స్టాఫ్ క్వార్టర్స్ మున్నగువాటి కోసం 320
8. టెలికమ్యూనికేషన్ శాఖ (డిఓటి)కు టెలికామ్ సేవల కోసం 282
9. సిబ్బందికి సంబంధించిన క్లెయిములు,
ఉదా: టెలికమ్యూనికేషన్ శాఖలో పనిచేసే
బిఎస్ఎన్ఎల్ సిబ్బంది జీతం, టెలికమ్యూనికేషన్
డిపార్టుమెంట్ (డిఓటి)లో ఇముడ్చుకోకుండా ఉన్న
ఉద్యుగులకు బిఎస్ఎన్ఎల్ చెల్లించిన లోన్లు, అడ్వాన్సులు,
డిఓటి ఉద్యోగుల (ఇముడ్చుకోని) సెలవు కాలానికి చెల్లించే
లీవ్, ఎల్ఎస్పిసి డబ్బులు ఇతరత్రా వాటి కోసం 225
10 బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు డిఓటిలో పనిచేసిన కాలానికి
సంబంధించి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ రియింబర్స్‌మెంట్ 11,998
11. అండమాన్ నికోబార్, లక్షద్వీప్, అస్సాం,
యుఎస్ఒఎఫ్ల నుంచి క్లెయిములు 30
12. 25,000 వై-ఫై హాట్ స్పాట్ ప్రాజెక్టు 131
13. అమర్నాథ్ యాత్ర కోసం వయబిలిటీ గ్యాప్ ఫండ్ 16
-------------------------------------------------
మొత్తం చెల్లించాల్సింది : 38, 540