Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారుల్లో పెరుగుదల లోపం
- 35 శాతానికి పైగా పిల్లల్లో ఇదే సమస్య
- ఆరోగ్య నిపుణుల ఆందోళన
- లక్ష్యాలను విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : భారత్‌లోని చిన్నారుల్లో పోషకాహార లోపం రోజురోజుకూ తీవ్ర సమస్యగా పరిణమిస్తున్నది. ఇది వారిలో పెరుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఇటు మహిళల్లోనూ పోషకాహారం లోపం తీవ్ర సమస్యగా మారింది. జాతీయ కుటుంబ సర్వే సమాచారంతో పాటు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. దేశంలోని చిన్నారులు, మహిళల్లో ప్రస్తుత పరిస్థితులపై వైద్య, ఆరోగ్య నిపుణులు ఆందోళనను వ్యక్తం చేశారు. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్-5) ఫలితాల ప్రకారం.. పిల్లల్లో పెరుగుదల లోపం (వయసుకు తగిన ఎత్తు లేకపోవటం) 35.5 శాతంగా ఉన్నది. అలాగే, వేస్టింగ్ (ఎత్తుతో పోలిస్తే తగిన బరువు ఉండకపోవటం) 19.3 శాతం, తక్కువ బరువు 32.1 శాతంగా నమోదైంది. కాగా, పోషకాహార లోపం ప్రపంచంలోనే భారత్‌లో అధికంగా ఉన్నదని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పెరుగుదల లోపంతో బాధపడుతున్న పిల్లలు మేఘాలయలో అత్యధికంగా (46.5శాతం) ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో బీహార్ (42.9శాతం) ఉన్నది. అసోం, దాద్రానగర్ హవేలీ, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, యూపీలు.. జాతీయ సగటు 35.5శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. పుదుచ్చేరి, సిక్కింలలో ఈ సమస్య శాతం అత్యల్పంగా ఉన్నది. ఎత్తుకు తగిన బరువు లేని చిన్నారుల సంఖ్య మహారాష్ట్రలో 25.6 శాతంగా ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ (25.1 శాతం) ఉన్నది. అసోం, బీహార్, దాద్రా, నగర్ హవేలి, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌లలో జాతీయ సగటు 19.3 శాతం కంటే ఎక్కువ మంది చిన్నారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
తక్కువ బరువు సమస్యను ఎదుర్కొంటున్న చిన్నారుల సంఖ్య బీహార్‌లో అత్యధికంగా (41 శాతం) ఉన్నది. ఆ తర్వాత గుజరాత్ (39.7 శాతం), జార్ఖండ్ (39.4శాతం) లు ఉన్నాయి. చిన్నారుల్లో ఈ సమస్య అసోం, దాద్రా మరియు నగర్ హవేలీ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీలలో జాతీయ సగటు 32.1 శాతం కంటే ఎక్కువగా ఉన్నది. అయితే, పై రెండు సమస్యల్లో (ఎత్తుకు తగిన బరువు, తక్కువ బరువు)నూ మోడీ సొంత రాష్ట్రం రెండో స్థానంలో ఉండటం గమనార్హం.
పోషకాహార లోపంతో మహిళలు
ఎన్ఎఫ్హెచ్ఎస్-5 సమాచారం ప్రకారం.. జార్ఖండ్‌లో అత్యధిక శాతం మంది స్త్రీలు (15 నుంచి 49 ఏండ్ల మధ్య వయసు కలిగినవారు) ఉన్నారు. వీరంతా తక్కువ బీఎంఐను కలిగి ఉన్నారు. అంటే వీరిలో చాలా మంది పోషకాహార సమస్యను ఎదుర్కొంటున్నారు. బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలలోనూ పోషకాహార లోపం ఉన్న మహిళలు అధికంగా ఉండటం గమనార్హం.
ప్రభుత్వ లక్ష్యాలు
ఈ మేరకు పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు కేంద్ర మహిళా, శిశుఅభివృద్ధి శాఖ కొన్ని ప్రత్యేక లక్ష్యాలను విడుదల చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరేండ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో పెరుగుదల లోపం, పోషకాహార సమస్యను ఏడాది రెండు శాతం తగ్గించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. అలాగే తక్కువ జనన బరువును ఏడాదికి రెండు శాతం తగ్గించటం, ఆరు నుంచి 59 నెలల మధ్య ఉన్న చిన్నారుల్లో, 15 ఏండ్ల నుంచి 49 ఏండ్ల మధ్య ఉన్న కౌమరదశ బాలికలు, మహిళల్లో రక్తహీనతను సంవత్సరానికి మూడు శాతం తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది.