Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23కి చేరిన రాజ్యసభ ఎంపీల సస్పెండ్
- మొత్తం 27 మంది ఎంపీలపై సస్పెన్షన్
న్యూఢిల్లీ : రాజ్యసభ నుంచి మరో ముగ్గురు సభ్యులు సస్పెండ్ అయ్యారు. దీంతో సస్పెండ్ అయిన సభ్యుల సంఖ్య 23 మంది రాజ్యసభ, నలుగురు లోక్‌సభ సభ్యులతో కలిపి మొత్తం 27 మంది సభ్యులకు పెరిగింది. గురువారం సస్పెండ్ అయిన రాజ్యసభ ఎంపీల్లో ఆప్‌కు చెందిన సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ పాఠక్, స్వతంత్ర ఎంపీ అజిత్ కుమార్ భుయాక్ ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై రాష్ట్రపత్ని అని కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి చేసిన ''అవమానకరమైన'' వ్యాఖ్యలకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో మహిళను అవమానించడాన్ని సోనియా గాంధీ ఆమోదించారని అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన 'రాష్ట్రపత్ని' వ్యాఖ్యపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరికి వ్యతిరేకంగా ఉభయ సభల్లో బీజేపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పక్ష ఎంపీలు ఆందోళన చేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ ప్రారంభమైన 11 నిమిషాలకు, లోక్‌సభ నాలుగు నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. మరోవైపు ధరల పెరుగుదల, ఆహార పదార్థాలపై జీఎస్టీ అంశాలను చర్చించాలని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. వెల్‌లోకి దూసుకెళ్లి తమ ఆందోళన కొనసాగించారు.
తిరిగి ప్రారంభమైన సభలో ఇదే తంతు కొనసాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య రెండు సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ సెకెన్లలోనే సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడగా, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలను సస్పెండ్ చేసిన తరువాత ఐదు నిమిషాలకే మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. సస్పెండ్‌కు గురైన ముగ్గురు రాజ్యసభ ఎంపీలల్లో ఇద్దరు సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ పాఠక్ ఆప్‌కు చెందిన వారుకాగా, స్వతంత్ర ఎంపీ అజిత్ కుమార్ భుయాక్ ఒకరు ఉన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ తమ ఆందోళన కొనసాగడంతో రెండు నిమిషాలకే నాలుగు గంటలకు వాయిదా వేశారు.
అవసరమైతే రాష్ట్రపతికే క్షమాపణ చెబుతాను : అధిర్ రంజన్ చౌదరి
''క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదు. నేను పొరపాటున 'రాష్ట్రపత్ని' అన్నాను. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా కొండపై నుంచి పర్వతాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది'' అని అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. తాను రాష్ట్రపతికి క్షమాపణలు చెబుతానని, మరెవరికీ చెప్పనని అన్నారు. ''రాష్ట్రపత్ని అని పొరపాటు దొర్లింది. అది నా తప్పు. నేను బెంగాలీని, హిందీ మాట్లాడే వ్యక్తిని కాదు. కాబట్టి అది జారిపోయింది. దేశ అత్యున్నత పదవికి అవమానం కలిగించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా కలలో కూడా అలా చేయాలని అనుకోలేను'' అధీర్ చౌదరి అన్నారు. ''తప్పు చేశానని ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పాను. ఏం చేయగలను. ఒకరు తప్పు చేయవచ్చు. నేను బెంగాలీని, హిందీ నా మాతృభాష కాదు. నాకు హిందీ అలవాటు లేదు. రాష్ట్రపతి మనస్తాపం చెందితే, నేను ఆమెను కలుస్తాను. ఆమెతో మాట్లాడతాను. ఆమెకు వివరిస్తాను. ఈ ఉన్నత పదవిలో నేను ఎవరినీ అగౌరవపరచను. దానికి ఉరిశిక్ష వేస్తారా? వేయండి. మేడమ్ (సోనియా గాంధీ)ని దానిలోకి ఎందుకు లాగారు?'' అని ప్రశ్నించారు. ''నాకు హిందీ రాదు. అంతేగాని నాకు ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా అవమానిస్తారని, వారిని అణగదొక్కాలని అర్థం కాదు'' అని తెలిపారు. ''రాష్ట్రపతి, బ్రాహ్మణుడు, గిరిజనుడు ఎవరైనా సరే, రాష్ట్రపతి రాష్ట్రపతే. ఇది గొప్ప గౌరవం. ప్రతిష్ట కలిగిన పదవి. బుధవారం మేము ర్యాలీగా ఎక్కడికి రాష్ట్రపతి భవన్‌కు వెళ్తున్నప్పుడు, ఆ ర్యాలీ గందరగోళంలో ఎక్కడికి వెళ్తున్నారని విలేకరులు నన్ను అడిగినప్పుడు, నేను రాష్ట్రపతిని కలవడానికి రాష్ట్రపతి భవన్‌కు వెళ్తున్నామని, రెండు సార్లు చెప్పాను. మూడోసారి హఠాత్తుగా రాష్ట్రపత్ని జారిపోయింది. అది డిఫాల్ట్ ఒక్కసారి అలా వచ్చింది'' అని ఆయన అన్నారు. అది డిఫాల్ట్‌గా వచ్చిన తరువాత దానిని ఉపయోగించవద్దని మీడియాను అభ్యర్థించానని, అయితే అది టెలికాస్ట్ చేయొద్దని కూడా కోరానని తెలిపారు. ''ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. బీజేపీకి మాకు వ్యతిరేకంగా చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి వారు కొంత మసాలా దొరికిందన్నారు'' చౌదరి చెప్పారు. ద్రౌపది ముర్ముపై అధిర్ చౌదరి చేసిన 'రాష్ట్రపత్ని' వ్యాఖ్యపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ అతను ఇప్పటికే క్షమాపణలు చెప్పాడని పేర్కొన్నారు.
పార్లమెంట్ ప్రతిపక్షాల ఆందోళన
పార్లమెంట్ ఆవరణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సస్పెండ్ అయిన ఎంపీలు 55 గంటల పాటు ధర్నా కొనసాగింది. సస్పెండ్ అయిన 24 మంది ఎంపిలకు మద్దతుగా మిలిగిన ప్రతిపక్ష ఎంపిలంతా ఆందోళన చేపట్టారు. అంతకు ముందు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్షాల సమావేశం జరిగింది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. జైరాం రమేష్, అధిర్ రంజన్ చౌరది (కాంగ్రెస్), ఎలమారం కరీం (సీపీఐ(ఎం), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), జయంతి చౌదరి (ఆర్ఎల్డీ), షణ్ముగమ్ (డీఎంకే), ఫౌజియా ఖాన్ (ఎన్సీపీ), బినరు విశ్వం (సీపీఐ), ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ (ఆర్ఎస్పీ) తదితరులు పాల్గొన్నారు.