Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పీకర్‌కు కాంగ్రెస్ ఎంపీల ఫిర్యాదు
- ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ ఎంపీలు దురుసుగా ప్రవర్తించారు. దీనిపై కాంగ్రెస్ మహిళ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల లోక్‌సభ వాయిదా పడిన తరువాత, సోనియా గాంధీ బయటకు వెళ్లబోతుండగా, బదులుగా బీజేపీ ఎంపీ రమాదేవితో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు ఆమె వెంట ఉన్నారు. బీజేపీ ఎంపీ రమాదేవి వద్దకు సోనియా గాంధీ వెళ్లి, తనను ఎందుకు ఈ ఇష్యూలోకి లాగారో తెలుసుకోవాలని కోరింది. ''అధీర్ రంజన్ చౌదరి ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. నా తప్పు ఏమిటి?'' అని ప్రశ్నించారు. అక్కడకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేరుకొని, సోనియాగాంధీతో వాగ్వాదానికి దిగారు. స్మృతి ఇరానీ బీజేపీ మహిళా ఎంపీలకు సైగ చేసి అధిర్ రంజన్ చౌదరికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. అక్కడికి బిజెపి మహిళా ఎంపిలు చేరుకొని సోనియా గాంధీని చుట్టుముట్టారు. అయితే తొలిత సోనియా గాంధీ ఇరానీ దురుసత్వాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ స్మృతి ఇరానీ మరోవైపు ఉన్న బీజేపీ ఎంపీలవైపు సైగ చేశారు. దీంతో సోనియా గాంధీ కోపం వ్యక్తం చేశారు. స్మృతి ఇరానీ మాట్లాడినప్పుడు, సోనియా గాంధీ ''నాతో మాట్లాడవద్దు'' అని అన్నారు. దీంతో బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. సోనియా గాంధీని బీజేపీ మహిళా ఎంపీలు చుట్టుముట్టారు. అక్కడికి ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, టీఎంసీ ఎంపీలు మహువా మోయిత్రా, అపరూప పొద్దార్లు సోనియా గాంధీని అధికార బెంచ్‌ల నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడు రమాదేవి, సోనియా గాంధీలను బీజేపీ ఎంపీలు చుట్టుముట్టారు. ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ మహిళా ఎంపీలంతా లోక్‌సభలో ముందు వరుసలో కూర్చున్నారు. అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
బీజేపీ ఎంపీ రమాదేవి మీడియాతో మాట్లాడుతూ తన పేరును ఎందుకు ఈ ఇష్యూలోకి లాగారో తెలుసుకోవాలని సోనియా గాంధీ కోరారని తెలిపారు. నేను చేసిన తప్పేంటో చెప్పాలని అడిగారని పేర్కొన్నారు. సోనియా గాంధీ మాట్లాడుతూ రమాదేవి తనకు తెలుసు కాబట్టి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. ''నాకేం భయం లేదు. నాకు రమా దేవి తెలుసు కాబట్టి అధీర్ క్షమాపణలు చెప్పాడని చెప్పడానికి వెళ్ళాను. నాపై ఎందుకు దాడి చేస్తున్నావు?'' అని అడిగానని సోనియా గాంధీ తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సభ్యులతో సోనియా గాంధీ బెదిరింపు ధోరణితో మాట్లాడారని ఆరోపించారు. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా లోక్‌సభలో 75 ఏండ్ల మహిళా సీనియర్ నాయకురాలు చుట్టుముట్టి తోడేళ్లులా వ్యవహరించారని విమర్శించారు. ఆమె చేసినదంతా మరొక సీనియర్ మహిళ ప్యానెల్ ఛైర్‌పర్సన్‌తో మాట్లాడడమేనని తెలిపారు. అయితే జరిగిందొకటి అయితే బీజేపీ సభ్యులు మీడియాలో అబద్దాలు, తప్పులు మాట్లాడటం అసహ్యమని పేర్కొన్నారు. లోక్‌సభలో అన్ని నియమ నిబంధనలు ప్రతిపక్షాల కోసం మాత్రమే ఉన్నాయని, లోక్‌సభను బీజేపీ పది నిమిషాల్లో హైజాక్ చేశారని విమర్శించారు. సోనియా గాంధీ రమాదేవితో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారని, స్మృతి ఇరానీ వేళ్ల చూపిస్తూ ఆమె వద్దకు వచ్చినప్పుడు సోనియా గాంధీ మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ''మీకు ఎంత ధైర్యం'' అని ఇరానీ దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఇరానీ, బీజేపీ ఎంపీలు సోనియా గాంధీ పట్ల క్రూరమైన ఎగతాళి, మాటల దాడి, భౌతిక బెదిరింపులకు గురి చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పట్ల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ మహిళ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలని, సంఘటన వీడియో ఫుటేజీని పరిశీలించాలని వారు కోరారు.