Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 67 వేల మందికి ఉద్యోగావకాశాలు
- రాబోయే ఐదేండ్లలో ప్రభుత్వ లక్ష్యం : సీఎం విజయన్
తిరువనంతపురం : రాష్ట్రంలో ఐటీ రంగంపై కేరళ సర్కారు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నది. ఈ రంగంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు పెద్ద ఎత్తున కొలువులు అందించటానికి ప్రణాళికలు వేస్తున్నది. ఈ మేరకు ఒక నిర్దేశిత లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. రాబోయే ఐదేండ్లలో 63 లక్షల చదరపు అడుగుల ఐటీ స్థలం, 67 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని కేరళ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. ఇన్ఫోపార్క్ కొచ్చిలో సౌకర్యాలను ప్రారంభించే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. '' ఈ ప్రభుత్వం (ఎల్డీఎఫ్ సర్కారు) వచ్చినప్పటి నుంచి ఐటీ రంగంలో అసమానమైన అభివృద్ధి కార్యమ్రాలు జరిగాయి. 2016 నుంచి 2022 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల చదరపు అడుగుల ఐటీ స్థలం సృష్టించబడింది. 45,760 కొత ఉద్యోగాలు కల్పించబడ్డాయి'' అని తెలిపారు. ఐటీ రంగానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు కొచ్చి, త్రిసూసర్లోని ఇన్ఫోపార్క్స్ మరిన్ని కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. అలాగే, ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ లో సౌకర్యాలను సీఎం ప్రారంభించారు. ఇన్ఫోపార్క్ కొచ్చిలో 35 వేల చదరపు అడుగుల్లో 10 కార్యాలయాల కోసం నూతన సౌకర్యాలున్నాయి. కొచ్చి, త్రిస్సూర్ ఇన్ఫోపార్క్లలో మొత్తం 1,60,00 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన సౌకర్యాలు కల్పించబడ్డాయి. కరోనా మహమ్మారి తర్వాత ఇన్ఫోపార్క్ భారీ వృద్ధిని సాధించిందని కేరళ ఐటీ పార్క్స్ సీఈఓ జాన్.ఎం.థామస్ తెలిపారు. క్యాంపస్‌లోని చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు ఇన్ఫోపార్క్ అద్భుతంగా ఎదగటానికి సహకరించాయన్నారు.