Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ నుంచే అత్యధిక అభ్యర్థనలు
- 3992 డిమాండ్లు చేసిన కేంద్రం
- 'ట్రాన్స్పరెన్సీ నివేదిక'లో ట్విట్టర్ వెల్లడి
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాలే వేదికగా నిజాలను బయటపెడుతున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలపై మోడీ సర్కారు అణచివేత చర్యలకు దిగుతున్నది. వారి నుంచి వెలువడిన సమాచారాన్ని ఎలాగైనా తొలగించటానికి అనేక ప్రయత్నాలను చేస్తున్నది. ఇందుకు సామాజిక మాధ్యమ సంస్థలపై తన అధికార బలాన్ని వినియోగిస్తున్నది. జర్నలిస్టులు, వార్త సంస్థల అధికారిక హ్యాండిల్ల నుంచి వెలువడిన ట్వీట్లను (కంటెంట్‌ను) తొలగించాలంటూ గతేడాది జులై-డిసెంబర్ మధ్య భారత్ అధిక సంఖ్యలో డిమాండ్లు చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ తన 20వ ట్రాన్స్పరెన్సీ నివేదికలో వెల్లడించింది.ఈ నివేదిక సమాచారం ప్రకారం.. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా 326 లీగల్ డిమాండ్లు అందాయి. గత నివేదిక కంటే ఇది 103 శాతం అధికం కావటం గమనార్హం. ఇందులో భారత్ నుంచే అత్యధికంగా 114 న్యాయ సంబంధ అభ్యర్థనలు అందాయి. ఆ తర్వాతి స్థానాల్లో టర్కీ (87), రష్యా (55) లు ఉన్నాయి. ట్విట్టర్ నుంచి సమాచారం (కంటెంట్)ను (జర్నలిస్టులు, వార్త సంస్థలు చేసిన పోస్టులు కలుపుకొని) తొలగించాలంటూ భారత్ 3,992 లీగల్ డిమాండ్లను చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అభ్యర్థనలు చేసిన తొలి ఐదు దేశాల్లో భారత్ ఒకటి కావటం గమనార్హం. ఇక ఖాతా సమాచార అభ్యర్థన చేసిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నది. భారత్ నుంచి మొత్తం 2,211 అభ్యర్థనలు సామాజిక మాధ్యమ వేదికకు అందాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11,500కు పైగా ఖాతా సమాచార వినతులను ట్విట్టర్ స్వీకరించింది. ఈ జాబితాలో అత్యధికంగా 20 శాతం అభ్యర్థనలతో యూఎస్ మొదటి స్థానంలో, భారత్ (19 శాతం) రెండో స్థానంలో ఉన్నాయి. జపాన్ (17 శాతం), ఫ్రాన్స్ (17శాతం) లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ''వెరిఫైడ్ జర్నలిస్టులు, వార్త సంస్థలపై చర్యలు క్రమంగా పెరగుతున్నాయి. ప్రస్తుత నివేదిక సమయంలో వీరి నుంచి వచ్చిన మొత్తం 17 ట్వీట్లు నిలిపివేయబడ్డాయి. గత నివేదిక సమయంలో ఇది 11గా ఉన్నది'' అని నివేదిక వివరించింది. గతేడాది జనవరి నుంచి జూన్ మధ్య జర్నలిస్టులు, వార్త సంస్థల నుంచి వచ్చిన కంటెంట్‌ను తొలగించాలని అభ్యర్థన చేసిన దేశాల్లోనూ భారత్ ముందు స్థానంలో ఉండటం గమనార్హం. ఆ సమయంలో మొత్తం 231 లీగల్ డిమాండ్లకు గానూ భారత్ నుంచ 89 అందాయి. కంటెంట్ తొలగింపునకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సంస్థకు 47,600కు పైగా అభ్యర్థనలు అందాయి.