Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ స్వతంత్ర బలం పెంపు
- లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులతో కూడిన విస్తృత వేదిక
- విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18 వరకు 24వ అఖిల భారత మహాసభ
- రాజకీయ తీర్మాన ముసాయిదాను విడుదల చేసిన డి.రాజా
న్యూఢిల్లీ : దేశంలో వామపక్ష ఐక్యత బలోపేతం, సీపీఐ స్వతంత్ర బలం పెంచుకోవాల్సిన అవసరం ఉందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. శుక్రవారం నాడిక్కడ సీపీఐ ప్రధాన కార్యాలయం (అజయ్ భవన్)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ 24వ అఖిల భారత మహాసభ రాజకీయ తీర్మాన ముసాయిదాను డి.రాజా, జాతీయ కార్యదర్శులు అమర్జిత్ కౌర్, బినరు విశ్వంలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ 24వ అఖిల భారత మహాసభ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18 వరకు జరగనున్నాయని తెలిపారు. ఈ మహాసభల్లో ప్రవేశపెట్టే రాజకీయ తీర్మానాన్ని పార్టీ జాతీయ కౌన్సిల్ ఆమోదించిందని పేర్కొన్నారు. 2019 లోక్సభ ఎన్నికలలో రాహుల్ గాంధీని కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయం వామపక్షాలకు నష్టం చేకూర్చిందని తెలిపారు. ఇది లౌకిక, ప్రజాస్వామ్య ఐక్యతను నిరోధించిందని పేర్కొన్నారు. ఎన్నికల పోరులో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ గట్టి ప్రతిపక్ష ఐక్యతను ఏర్పరచలేకపోయిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలనకు ప్రత్యామ్నాయంగా లౌకిక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులతో కూడిన విస్తృత సంకీర్ణాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య, సోషలిజం లక్ష్యాల పరిరక్షణతో కూడిన నవ భారత నిర్మాణానికి సీపీఐ ప్రజాతంత్ర శక్తులను కూడగడుతుందని తెలిపారు. రాజకీయ ఎత్తుగడలకు సంబంధించి 23వ మహాసభ తీసుకున్న నిర్ణయానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిల్లో పొత్తులు పెట్టుకొని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాని ఓడిస్తామని తెలిపారు. జీవనోపాధి వంటి ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని అన్నారు. దేశంలో సిద్ధాంత పరంగా కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణకు తాము సాధ్యమైనంత ప్రయత్నం చేస్తామని చెప్పారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తోందని పేర్కొన్నారు.