Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దలకు అనుకూలంగా మైనింగ్
- గనుల తవ్వకం, లీజ్‌లో పెనాల్టీలు రద్దు, మినహాయింపులు
- '1960' గనుల రాయితీ నిబంధనల సవరణలు
- ప్రభుత్వ ఖజానాపై దెబ్బ : నిపుణులు
న్యూఢిల్లీ : మనదేశంలో గనుల తవ్వకం, లీజు హక్కులు బడా కార్పొరేట్లకు కనకవర్షం కురిపిస్తోంది. బొగ్గు క్షేత్రాల వేలం పాట, అందునా 'కమర్షియల్ మైనింగ్' గనుల బిడ్డింగ్ ఎప్పుడెప్పుడా అని బడా కార్పొరేట్లు ఎదురు చూస్తున్నారు. గనుల తవ్వకం, లీజ్‌కు సంబంధించి కీలక నిబంధనల్ని సడలించటం, కార్పొరేట్లకు అనుకూలంగా మార్చటం దీనికి కారణమని తెలుస్తోంది. పెనాల్టీ, రాయల్టీ చెల్లింపు నిబంధనల్లో మార్పులు చేస్తూ జులై 22న కేంద్ర గనుల శాఖ ఒక పబ్లిక్ నోటీస్ సైతం జారీచేసింది. పార్లమెంట్ ఆమోదముద్ర పడితే పెనాల్టీ చెల్లింపు నామమాత్రంగా మారే ప్రమాదముంది. అంతేగాక రాయల్టీలు, గనుల లీజ్ రూపంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయమూ దెబ్బతినే అవకాశముంది. గత నెల 28న అటవీ పరిరక్షణ నిబంధనల్లో పలు మార్పులు చేస్తున్నామని గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. కీలక చట్టాల్లో నిబంధనల మార్పులు గనుల తవ్వకంలో దోపిడీని పెంచాతాయని, బడా కార్పొరేట్ ఇష్టారాజ్యంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటవీ భూములను వేరే పనులకు వినియోగించటంపై సుప్రీంకోర్టు 2013లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. గనుల రాయతీ, అటవీ హక్కుల నిబంధనల్లో మోడీ సర్కార్ చేస్తున్న మార్పులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
దోపిడికి రంగం సిద్ధం
ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలోనే 'గనుల రాయతీ నిబంధనలు-1960'కు కేంద్రం సవరణలు చేస్తుందని సమాచారం. ఇందుకోసంగానూ అటవీ హక్కుల చట్టం-2006ను నీరుగార్చుతోంది. గ్రామసభ, స్థానిక గిరిజనులు, ఆదివాసీల అనుమతి, అంగీకారంతో సంబంధం లేకుండా అటవీ భూముల్ని ప్రయివేటు చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు నిక్షేపాల్ని ప్రయివేటు చేతుల్లో పెట్టడానికి మోడీ సర్కార్ మెల్ల మెల్లగా పావులు కదుపుతోంది. బొగ్గురంగంలో అనేక నిబంధనల్ని కేంద్రం ఇప్పటికే సడలించింది. వాణిజ్య అమ్మకానికి అనుమతించింది. మరో 122 బొగ్గు క్షేత్రాలకు కమర్షియల్ మైనింగ్ అనుమతులు ఇస్తూ ఈ ఏడాది మార్చిలో ఆదేశాలు జారీచేసింది. వీటి బిడ్డింగ్ ఇంకా చేపట్టాల్సి ఉంది. పర్యావరణ నిపుణుడు తుషార్ దాష్ మాట్లాడుతూ..''అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూ కేంద్రం కొత్త చట్టాల్ని, నిబంధనల్ని తీసుకొస్తోంది. అటవీ భూముల్ని వేరే పనుల నిమిత్తం వినియోగించదలిస్తే, స్థానికంగా ఉండే గిరిజనులు, ఆదివాసీల అంగీకారం తప్పనిసరి. గ్రామసభ అంగీకారం తప్పనిసరి. ఇదంతా పెద్ద అడ్డంకి అని కేంద్రం భావించి..నిబంధనల్ని మార్చడానికి సిద్ధమైంది. బొగ్గు తవ్వకాల్లో సైతం నిబంధనల్ని మార్చేసింది'' అని చెప్పారు.
ప్రయివేటుకు భారీ ఆదాయం
గనుల తవ్వకం, లీజ్‌పై ప్రభుత్వానికి ఆయా కంపెనీలు ప్రతిఏటా రాయల్టీలు, ఇతర చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే ఆయా కంపెనీలు రాయల్టీలు, ఇతర ఫీజులు సమయానికి చెల్లించటం లేదు. భారీ లాభాలు ఆర్జిస్తున్నా అదే ధోరణి నడుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తమ ఉత్పత్తిని అమ్ముకుంటున్నాయి. దీనికితోడు ఇప్పుడు 'సులభతర వాణిజ్యం' (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పేరుతో మోడీ సర్కార్ చేస్తున్న చట్ట సవరణలు, నిబంధనల సడలింపు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 'మినరల్ కన్సేషన్ రూల్స్, 1960'ను గనుల కంపెనీలు ఉల్లంఘించినట్టు తేలితే కేంద్ర ప్రభుత్వానికి భారీ జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు రాయల్టీ చెల్లింపు గడువు 60 రోజులు దాటితే, ఆ మొత్తంపై 24శాతం వడ్డీ (ఏడాదికి) పెనాల్టీ కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. గనుల తవ్వకం, కేటాయింపు ప్రయివేటుకు అప్పజెప్పేందుకు అటవీ హక్కుల చట్టంలో కీలక మార్పులు చేయబోతోంది. ఇందుకోసంగాను కేంద్రం 'నూతన అటవీ పరిరక్షణ నిబంధనల్ని' తీసుకురాబోతోంది. దీని ప్రకారం, ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించినా కేంద్రం ఆమోదముద్ర వేస్తే చాలు. స్థానికంగా ఉండే ఆదివాసీ, గిరిజనుల హక్కులతో సంబంధం లేకుండా ఏకపక్షంగా భూముల్ని బడా కంపెనీలకు అప్పగించవచ్చు. ఇదంతా కూడా పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.