Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్నిగా పిలిచినందుకు కాంగ్రెస్ నేత అదిర్ రంజన్ చౌదరి చేత బలవంతంగా క్షమాపణ చెప్పించడం మంచిదే, కానీ, మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ లేదా సెక్సీ జోక్‌లు వేస్తూ తామేదో ఫన్నీగా వ్యవహరిస్తున్నామనుకునే నేతలు గురించి చెప్పుకోవాలంటే పార్టీలకతీతంగా చాలానే వున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఇటుంటి సెక్సీ భాషను ఉపయోగించే వారికి వ్యతిరేకంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు ఒక నిబంధనావళిని రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఎం నేత బృందాకరత్ పేర్కొన్నారు. పార్లమెంట్, చట్టసభలు ఎవరికి వారు తమదైన యంత్రాంగాలను రూపొందించుకోవడం మంచిదని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తన స్వంత సభ్యులపైనే చర్యలు తీసుకోవడం ద్వారా పార్లమెంట్ ఆదర్శప్రాయంగా వ్యవహరించిన పక్షంలో ప్రజా కార్యాచరణ ప్రమాణాలపై మంచి ప్రభావం కనపడుతుందని అన్నారు. కాంగ్రెస్ ఎంపి అదిర్ చౌదరి రాష్ట్రపత్ని అని సంభోదించగానే స్పీకర్ ఆయనను క్షమాపణలు చెప్పాల్సిందిగా కోరవచ్చు. అక్కడితో ఆ సమస్య పరిష్కారమై వుండేది. కానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై బీజేపీ నేత స్మృతి ఇరానీ దురుసుగా వ్యవహరించారు. ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ఆమెను బాధ్యురాలిని చేస్తూ మాట్లాడారు. రాజ్యసభలో నిర్మలా సీతారామన్ కూడా ఇదే రీతిలో వ్యవహరించారు. ఇదంతా చూస్తుంటే పూర్తిగా కుట్రగా కనిపించింది. పక్కా ప్రణాళిక ప్రకారం సోనియాపై దాడికి సిద్ధమైనట్లు కనిపిస్తోందని బృందాకరత్ పేర్కొన్నారు. దీనివల్ల మహిళా రాష్ట్రపతిపై ఇలాంటి సెక్సీ వ్యాఖ్యలు చేసినందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్న పాలక పక్షాలకు ఎలాంటి విశ్వసనీయత దక్కకుండా పోయిందని అన్నారు. పైగా ప్రధాని నరేంద్ర మోడీ పేద గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేయడాన్ని కాంగ్రెస్ సహించలేకపోయిందంటూ స్మృతి ఇరానీ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు అవమానకరంగా, అగౌరవపరిచేలా వున్నాయని బృందాకరత్ పేర్కొన్నారు. మహిళలకు సంబంధించిన విషయాలపై పార్టీలకతీతంగా మహిళా నేతలందరూ ఒకే గొంతు వినిపించడం సర్వ సాధారణం గతంలో ఇలాంటి ఉదాహరణలను మనం చాలా చూశాం. ఆ తరహాలోనే ఇప్పుడు కూడా ఇటువటి సెక్సీ వ్యాఖ్యలు చేసిన సభ్యులను బాధ్యులు చేస్తూ వారిపై చర్య తీసుకునేందుకు సమైక్యంగా ప్రయత్నం జరగాల్సి వుందని బృందా కరత్ అభిప్రాయడ్డారు. అయినా మహిళా రాష్ట్రపతిని కూడా రాష్ట్రపతి అని సంభోదించడంలో ఎలాంటి తప్పు లేదని పార్లమెంటరీ వ్యవహారాల్లో నిపుణుడైన ప్రణబ్ ముఖర్జీ చెప్పిన విషయాన్ని బృందా ఇక్కడ గుర్తు చేశారు. కమిటీకి నేతృత్వం వహించేవారిని చైర్మన్ అంటున్న నేపథ్యంలో మహిళలు కూడా అడ్డంకులు దాటుకుని కమిటీ అధ్యక్ష పదవులకు ఎన్నికవుతున్న తరుణంలో ఆ పదాన్ని మార్చి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించడం ఆరంభించారు. మహిళలకు సంబంధించి మాట్లాడేటపుడు పితృస్వామ్య భావజాలం తొంగిచూస్తుంటుంది. దాన్ని సవాలు చేయాల్సిన, మార్చాల్సిన అవసరం వుంది. దేశంలో మహిళా రాష్ట్రపతి ఇది మొదలు కాదు, ఇదే ఆఖరు కాదు, కాబట్టి మహిళా రాష్ట్రపతిని సంబోధించేటపుడు రాష్ట్రపతి స్థానంలో తగిన, సముచితమైన పదాన్ని ఉపయోగించడం బాగుంటుందని బృందా కరత్ పేర్కొన్నారు.
నా క్షమాపణలు అంగీకరించండి
ద్రౌపది ముర్ముకు అధిర్ రంజన్ చౌదరి లేఖ
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి శుక్రవారం క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆమెకు లేఖ రాశారు. 'నోరు జారి అలా మాట్లాడాను. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతున్నాను. నా క్షమాపణలను అంగీకరించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.' అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతిని అవమానించాలని అలా అనలేదని, పొరపాటున నోరు జారానని ఆయన తెలిపారు. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా దీనిని వివాదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.