Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాస్థాయిలో న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి:
- సీజేఐ ఎన్వి రమణ
- అండర్ ట్రయల్ ఖైదీల విడుదలను వేగవంతం చేయండి : ప్రధాని
న్యూఢిల్లీ : ప్రజల ఇంటి గడపకు న్యాయాన్ని చేర్చగలిగేలా జిల్లా స్థాయిలో న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. దేశంలో చాలా మంది ప్రజలు న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేక, న్యాయ సహకారం అందక మౌనంగా బాధపడుతున్నారని తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం నిర్వహించిన జిల్లా న్యాయ సేవల అధికారుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. చాలామందికి జిల్లా న్యాయవ్యవస్థతోనే పరిచయం ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ గురించి ప్రజల అభిప్రాయం జిల్లా న్యాయ అధికారులతో వారి అనుభవాలపై ఆధారపడి ఉంటుందన్నారు. దేశంలో న్యాయ సహాయ ఉద్యమం వెనుక జిల్లా న్యాయవ్యవస్థ చోదక శక్తి అని తెలిపారు. అండర్ ట్రయల్ ఖైదీల హక్కుల విషయంలో న్యాయవ్యవస్థ, న్యాయ వాదుల జోక్యం పెరగాలన్నారు. 'జైలు విజిటింగ్ అడ్వకేట్లు' అండర్ ట్రయల్ తరపున అధికారులకు సకాలంలో ఫిర్యాదు చేయాలన్నారు. జైలు గోడల వెనుక ఏమి జరుగుతుందో ఆ ఖైదీల కుటుం బాలకు కూడా తెలియాలని అన్నారు. న్యాయ వ్యవస్థ సమస్యలను ''మభ్యపెట్టడం లేదా దాచి పెట్టడం'' చేయకూడదని చెప్పారు. అలా చేస్తే, సామాజిక న్యాయం అనే రాజ్యాంగ ఆదేశాన్ని నెరవేర్చలేకపోవచ్చునన్నారు. కాబట్టి చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. సర్వీస్ షరతులు, వేతనాలు, మౌలిక సదుపాయాల సమస్యలపై తక్షణ శ్రద్ధ అవసరమని అన్నారు. 27 సంవత్సరాల క్రితం ప్రారంభమైన నల్సా (నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) అందించిన సేవలను జస్టిస్ రమణ ప్రశంసించారు..
త్వరితగతిన చర్యలు : ప్రధాని మోడీ
అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పలు జైళ్లలో న్యాయ సహకారం కోసం ఎదురుచూస్తున్న అండర్‌ట్రయల్ ఖైదీల విడుదలకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని న్యాయస్థానాలను కోరారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఎంత ముఖ్యమో.. ఈజ్ ఆఫ్ జస్టిస్ కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఇందుకు న్యాయపరమైన మౌలిక సదుపాయాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలను పటిష్ఠం చేసేందుకుపనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ-కోర్టు మిషన్‌లో భాగంగా వర్చువల్ కోర్టులను ప్రారంభించామని, ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి నేరాలను విచారించేందుకు 24 గంటలూ పనిచేసే కోర్టులను తీసుకొస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీం న్యాయమూర్తులు యుయు లలిత్, డివై చంద్రచూడ్ తదితరులు హాజరయ్యారు. ఈ రెండు రోజుల సమావేశంలో అన్ని న్యాయ జిల్లాల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జిలు, డీఎల్ఎస్ఏ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్లతోసహా సుమారు 1,200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.