Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహార పదార్థాలపై జీఎస్టీ ఏకగ్రీవం కాదు
- తాము తీవ్రంగా వ్యతిరేకించాం
- రాష్ట్రాలపై విమర్శలు సరికాదు
- 'నవతెలంగాణ'తో కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్ బాలగోపాల్
న్యూఢిల్లీ : 'ఆహార పదార్థాలపై కేంద్రం తప్పుదోవ పట్టిస్తోంది. ఏకగ్రీవ నిర్ణయమని చెప్తున్నది. జీఎస్టీ కౌన్సిల్లో కేవలం అభిప్రాయాలే అడిగారు. తాము ఆహార పదార్థాలపై జీఎస్టీని వ్యతిరేకించాం. రాష్ట్రాలపై కేంద్రం విమర్శలు చేయడం సరికాదు. ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దాడి' అని కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్ బాలగోపాల్ అన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన కేరళ హౌస్‌లో 'నవతెలంగాణ'తో మాట్లాడారు.
ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించటాన్ని ఎలా చూస్తారు?
దేశంలో సామాన్య ప్రజలు ఇప్పటికే భారాలు మోస్తున్నారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. ఆ భారంతో దేశ ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పుడు ఆహార పదార్థాలపై జీఎస్టీ అదనపు భారం. ఇది సామాన్య ప్రజలకు వ్యతిరేకమైనది. అందుకే మేము కేరళలో ఆహార పదార్థాలపై జీఎస్టీని రద్దు చేశాం.
జీఎస్టీ కౌన్సిల్లో మీరు ఉన్నారు కదా? మీరు వ్యతిరేకించలేదా?
ఇటీవలి చండిగఢ్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ తర్వాత ఆహార పదార్ధాలపై జీఎస్టీ 5 శాతం పెంచుతూ ఏకగ్రీవం నిర్ణయం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అసలు కౌన్సిల్లో ఓటింగ్ జరగదు. కేవలం అభిప్రాయాలు మాత్రమే అడుగుతారు. నేను, నాతో పాటు మరికొంత మంది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేశాం. కానీ కేంద్రం పట్టించుకోలేదు. అసలు ఈ ధరల నిర్ణయం అక్కడ జరగలేదు. ధరలు హేతుబద్దీకరణ చేయడానికి ఆర్థిక మంత్రులతో ఒక సభ కమిటీ ఉంది. అది నిర్ణయిస్తుంది. దాన్ని జీఎస్టీ కౌన్సిల్లో ప్రవేశపెట్టి, రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతారు.
ఆ కమిటీలో మీరు సభ్యులా? అప్పుడు వ్యతిరేకించారా?
అవును. నేను ఆ కమిటీలో సభ్యుడినే. మా కమిటీకి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చైర్మెన్. నాతో పాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్ర, గోవా రవాణా, పంచాయితీ రాజ్ గహనిర్మాణ శాఖ మంత్రి మౌవిన్ గోడిన్హో, రాజస్థాన్ పట్టణాభివద్ధి, గహనిర్మాణ శాఖ మంత్రి శాంతి కుమార్ ధరివాల్, ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా ఉన్నారు. సబ్ కమిటీ సమావేశం గతేడాది నవంబర్ 20న వీడియో కాన్ఫెరెన్స్‌లో జరిగింది. తరువాత ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. అప్పుడు ఈ అంశంపై చైర్మెన్ ఎజెండా పెట్టారు. నేను, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ మంత్రులు ఆహార పదార్థాలపై జీఎస్టీ వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. అయితే సబ్ కమిటీలో బీజేపీ పాలిత కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మంత్రులు అనుకూలంగా ఉన్నారు. ఓటింగ్‌లో నలుగురు సానుకూలంగా ఉండటంతో సబ్ కమిటీ నిర్ణయించినట్టు ప్రకటించారు. అయితే నేను చైర్మెన్ బసవరాజ్ బొమ్మైకి రెండు సార్లు లేఖ రాశాను. ఇది మంచిది కాదు. ప్రజా వ్యతిరేకమైనదని అన్నా. ఆయన పట్టించుకోలేదు. కేంద్ర ఆర్థిక మంత్రికి కూడా లేఖ రాశా. కానీ ఎటువంటి సమాధానం రాలేదు.
కేంద్రం వైఖరి ఎలా ఉంది?
జీఎస్టీ విధింపుపై కేంద్రం మరింత స్పష్టత తీసుకురావాల్సి ఉన్నది. కానీ అలా చేయలేదు. జీఎస్టీపై కేంద్రం మొండిగా ఉన్నది. ఈ వైఖరి మారాలి. నా ఆలోచన ప్రకారం కేంద్రం పునరాలోచన చేస్తుందనుకుంటున్నాను. ఎందుకంటే ఈ నిర్ణయం కోట్లాది మంది ప్రజలపై భారంగా ఉన్నది. కేంద్రం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై ప్రయోగిస్తున్నది.
మీరు కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా?
అవును. కేంద్రం నుంచి ఏ పరిణామాలనైనా ఎదుర్కొ వడానికి సిద్ధంగా ఉన్నాం. జీఎస్టీపై రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బ్రాండెడ్ వస్తువుల మేరకే జీఎస్టీ ఉండాలని మేము కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో 'కుటుంబ శ్రీ'తో 1, 2 కిలోల ప్యాకెట్లలో చిన్న దుకాణాలు విక్రయిం చే వస్తువులపై పన్ను విధించే ఉద్దేశం లేదు. ఈ నిర్ణయం ద్వారా కేంద్రంతో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. అయితే రాజీకి రాష్ట్రం సిద్ధంగా లేదు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్లోనూ చెప్పాను. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కేంద్రానికి లేఖ రాశారు.
జీఎస్టీ బకాయిలు సకాలంలో విడుదల చేస్తుందా?
జీఎస్టీ బకాయిలు సకాలంలో విడుదల చేయలేదు. మేము, మాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు జీఎస్టీ పరిహారం మరో ఐదేండ్లు పెంచాలని డిమాండ్ చేశాం. కానీ అందుకు కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఈ సంవత్సరం రెవెన్యూ లోటు గ్రాంట్‌ను దాదాపు రూ.7,000 కోట్లకు తగ్గించింది. దాదాపు రూ.12,000 కోట్ల జీఎస్టీ పరిహారం నిలిపివేసింది.
కేంద్రానికి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిందా?
అప్పుల విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. అప్పులు తీసుకోవడంలో కేంద్రానికి పరిమితి లేదు. కానీ రాష్ట్రాలకు పరిమితి విధించింది. కేంద్రం విచ్చల విడిగా అప్పులు తీసుకుంటుంది. కానీ రాష్ట్రాలు చేస్తే నిందిస్తుంది. రాష్ట్రాలు రాష్ట్ర అభివద్ధి కోసం చేస్తాయి. కానీ కేంద్రం దేని కోసం చేస్తున్నదని ఇప్పటికీ స్పష్టం చేయటం లేదు. కరోనా కాలంలో రాష్ట్రాలు సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. కేంద్ర సాయం ఏమీ లేదు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఆ సమయంలో రాష్ట్రాలు అప్పులు చేశాయి. కానీ దీనికి కేంద్రం రాష్ట్రాలపై దుష్ప్రచారం చేస్తున్నది. రాష్ట్ర సంస్థలు రుణాన్ని తీసుకోవడాన్ని రాష్ట్ర అప్పులతో కలపడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం. రాష్ట్రాల రుణాలు తీసుకునే అధికారాలకు భంగం కలిగిస్తోంది.