Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదేండ్లలో కేసీఆర్ ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
- టీఆర్ఎస్తో పొత్తులపై ఉహాగానాలు సరికాదు
- ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రంలో అప్రజాస్వామ్య పాలన
- మతోన్మాద శక్తులను అడ్డుకోవడం ముఖ్య కర్తవ్యం
- రాష్ట్రంలో చౌకబారు రాజకీయాలు పెరిగాయి
- విచక్షణ రహిత అప్పులను సమర్థించం
- మీడియాతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
న్యూఢిల్లీ : ఎనిమిదేండ్లలో కేసీఆర్ తాను ఇచ్చిన ప్రధానమైన వాటిలో ఏ ఒక్క వాగ్దానాన్నీ నేరవేర్చలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన శనివారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వచ్చే వాతావరణం కనబడుతుందనీ, అధికార టీఆర్ఎస్, ప్రతి పక్ష కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని దాదాపుగా ప్రారంభిం చాయని అన్నారు. ప్రజలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వారి వారి ప్రకటనల్లో, పర్యటనల్లో ఎక్కడా ప్రస్తావన రావటంలేదన్నారు. కేవలం అవినీతి, వ్యక్తిగత ఆరోపణలు వంటి చౌకబారు రాజకీయాలు రోజువారీ విమర్శల్లో ఉంటున్నాయని విమర్శించారు.
కెేసీఆర్‌కు ప్రజల నుంచి వ్యతిరేకత
కేసీఆర్ ప్రభుత్వంపట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నదని తెలిపారు. కొన్ని సంక్షేమ పథకాలు, ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, అవే కెేసీఆర్‌ను గట్టెక్కిస్తాయనే నమ్మకం లేదన్నారు. పైగా బీజేపీ ఆయనపై చాలా తీవ్రంగా గురి పెట్టినట్టు అనిపిస్తోందనీ, అందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో ప్రధాని మోడీ, అమిత్ షాలతో పాటు అగ్రనాయకులంతా హైదరాబాద్ వచ్చినప్పుడు వారి మధ్య ఘర్షణ పతాక స్థాయికి చేరిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణపై పట్టుకోసం బీజేపీ పెద్ద ఎత్తున కార్యవర్గ సమావేశాలు నిర్వహించి, దాని ప్రభావాన్ని రాష్ట్రంపై వేయాలని చూస్తోందన్నారు. కానీ, కేసీఆర్ ఆ ప్రభావాన్ని సగానికి సగం తగ్గించడంలో విజయవంతం అయ్యారని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలతో బీజేపీని బోనులో నిలబెట్టగలిగారన్నారు. గత ఎనిమిదేండ్లుగా లాలూచీ కుస్తీ ఎంత నడిపినప్పటికీ, ఇటీవల బీజేపీతో సూటిగా ఘర్షణ పడటంలో, ఘాటుగా విమర్శించడంలో కేసీఆర్ చాలా ముందున్నారనీ, ఆయన చేసే పని మంచిదేనన్నారు.
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా...
కెేసీఆర్ ఒక రకమైన భయంలో ఉన్నారనీ, రాత్రిపూట నిద్ర పడుతుందో లేదో తెలియడం లేదన్నారు. మహారాష్ట్రలో జరిగిన పరిణామాల తరువాత తెలంగాణలో కూడా షిండేలు తయారవుతారనే భయం కేసీఆర్‌లో ఉందన్నారు. తమకు షిండేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారని పేర్కొన్నారు. ఆ షిండేలను పక్కన పెడితే, ఇప్పుడు రాజకీయాలన్నీ మార్పిళ్లు, చేర్పుళ్లులో ఉన్నాయనీ, కోట్ల రూపాయాల బేరసారాల చుట్టు తిరుగుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ చెత్త రాజకీయాల నుంచి స్వచ్ఛ రాజకీయాలవైపు నడిపించాల్సిన బాధ్యత వామపక్షాలపై ఉందని తెలిపారు. ఇటీవలి జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వామపక్షాలన్నింటికీ ఐక్యం చేసి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడాటనికి, ప్రజా సమస్యలపై పోరాటాలు, ఆందోళనలు చేయడానికి నిర్ణయం చేశామన్నారు. బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వ కూడదనేది తమ విధానమని, ఏంచేయాలో ఎన్నికల సమయంలో ఆలోచిస్తామని అన్నారు. ఎన్నికలు ప్రకటించే నాటికి, రాష్ట్రంలోని బలాబలాలు, రాజకీయ పరిస్థితులను బట్టీ తమ ఎత్తుగడలు ఉంటాయని ఒక పశ్నకు సమాధానం ఇచ్చారు.
విచిక్షణ రహిత అప్పులను సమర్థించం
విచిక్షణ రహితంగా అప్పులు చేయడాన్ని తమ పార్టీ సమర్థించదని, అప్పును వృథాగా ఖర్చు పెట్టడాన్ని వ్యతిరేకిస్తామన్నారు. అప్పు తీసుకోవడం అవసరం అవుతుందనీ, అయితే ఆ అప్పుతో అభివృద్ధి చేస్తే, అప్పు తీర్చడానికి అభివృద్ధి ఫలాలు ఊతం ఇస్తాయని అన్నారు. అయితే అప్పును వృథా చేస్తే రాష్ట్రానికి భారం అవుతుందనీ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అప్పులు రాష్ట్రానికి భారం అయ్యే పరిస్థితి ఉందని అన్నారు. కాళేశ్వరానికి అప్పులు తీసుకొచ్చి పెట్టారనీ, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమని అంటున్నారని తెలిపారు. కాళేశ్వరంతోనే తెలంగాణ అంతటా నీళ్లు రావనీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లు రావాలంటే, సీతారామ ప్రాజెక్టు కావాలనీ, ఉమ్మడి నల్గొండకు నీళ్లు రావాలంటే, దిండి ప్రాజెక్టు రావాలని ఉమ్మడి వరంగల్‌కు నీళ్లు రావాలంటే దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలనీ, ఉమ్మడి మహముబ్నగర్కు నీళ్లు రావాలంటే రంగారెడ్డి ఎత్తిపోతలు కావాలని అని అన్నారు.
వీటికి ఒక్క పైసా కూడా కేటాయించటం లేదని విమర్శించారు. ఇలా అయితే అప్పుల వల్ల ఉపయోగం ఏమీ లేదన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణకు రూ.50 వేల కోట్లు అప్పు వచ్చిందని, ఈ ఎనిమిదేండ్లలో కేసీఆర్ చేసిన అప్పు రూ.3లక్షల కోట్లని అన్నారు. రాష్ట్ర విభజన నాటికి తెలంగాణ ధనిక రాష్ట్రమని, కానీ నేడు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి వచ్చిందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తూ, కక్షపూరితంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, వచ్చిన అప్పులను అడ్డుకోవడం దారుణమని అన్నారు. రాష్ట్రాల పట్ల వివక్షత చూపిస్తోందని విమర్శించారు.
మతోన్మాద శక్తులను అడ్డుకోవడం ముఖ్యమైన కర్తవ్యం
మొదటి నుంచి వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తుల ప్రభావం ఉండే తెలంగాణలో కాషాయ కూటమి వేళ్లూనుకోవడమనేది ఏదో రాజకీయ పార్టీల మార్పిడి కాదనీ, ప్రజాస్వామ్య హననానికి దారితీసే ప్రక్రియ అవుతుందన్నారు. అందువల్ల అటువంటి మతోన్మాద శక్తులను అడ్డుకోవడం ముఖ్యమైన కర్తవ్యంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఆ కర్తవ్య నిర్వహణలో కేసీఆర్ వైఖరి కొంత సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీకి కేసీఆర్ వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన, ఆయనతో సీపీఐ(ఎం), కమ్యూనిస్టులకు ఎన్నికల పొత్తులు ఉంటాయనుకోవడం సరికాదన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో సీపీఐ(ఎం) అగ్రభాగాన ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో అప్రజాస్వామ్య పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదనీ, ముఖ్యమంత్రిని కలవాలంటే ఏ నాయకుడికి అపాయింట్మెంట్ లేదన్నారు. ఇటీవల వరద బాధితులకు సహాయం చేయడానికి తాను భద్రచలం వెళితే అరెస్టు చేశారనీ, వరద బాధితులకు సాయం చేస్తుంటే కూడా అరెస్టులు చేస్తుంటే.. ప్రజాస్వామ్యం ఎక్కడుందో అర్థం చేసుకోవాలన్నారు. మేడే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇబ్రహీంపట్నం వెళ్తే, అక్కడ పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాష్ట్ర కమిటీ సమావేశాల్లో హాజరయ్యేందుకు హనుమకొండ వస్తే, అక్కడ సభకు మున్సిపాలటి తొలుత అనుమతి ఇచ్చి, తరువాత ప్రభుత్వం కావాలనే రద్దు చేయించిందని దుయ్యబట్టారు. సీపీఐ(ఎం) కానీ, మరే ప్రతిపక్షమైన సాధారణ సభలు కూడా పెట్టుకొనే స్వేచ్ఛ లేదనీ, ఏ సభకు అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. ఈ వైఖరి ప్రజలను కేసీఆర్‌కు మరింత దూరం చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు.