Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాట్నా వర్సిటీలో విద్యార్థులు ఆందోళన
- జాతీయ విద్యా విధానం- 2020 వెనక్కి తీసుకోవాలని డిమాండ్
న్యూఢిల్లీ : రెండు రోజుల పర్యటన నిమిత్తం బీహార్ రాజధాని పాట్నాకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. శనివారం పాట్నా వర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనను చూసి..వందలాది మంది విద్యార్థులు, ''జె.పి.నడ్డా గో బ్యాక్..' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. జాతీయ విద్యా విధానం-2020ను రద్దు చేయాలని, పాట్నా వర్సిటీకి కేంద్ర హోదా మంజూరు చేయాలని విద్యార్థులు నినాదం చేశారు. ఆయన వాహనశ్రేణి ముందు కూర్చొని విద్యార్థులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పాట్నా వర్సిటీలో నడ్డా రాజనీతి శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. వర్సిటీ సెమినార్ హాల్లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. మోడీ సర్కార్ విధానాల్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) విద్యార్థులు పెద్ద సంఖ్యలో వర్సిటీకి చేరుకున్నారు. నడ్డాను చుట్టుముట్టిన విద్యార్థులు ఘెరావోకు దిగారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది విద్యార్థులపై దాడికి దిగి, నడ్డాను అక్కడ్నుంచి మరో చోటకు తీసుకెళ్లారు. అయితే నితీష్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెరవెనుకుండి ఇలాంటి నిరసనలు జరిపిస్తోందని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.