Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి కల్పిత ఆధారాలు సృష్టించటం, ఫోర్జరి ఆరోపణలపై అరెస్టయిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్, మాజీ పోలీసు ఉన్నతాధికారి ఆర్బీ శ్రీకుమార్‌లకు అహ్మదాబాద్ కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. గతనెల 26న పై ఆరోపణల మీద పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి బెయిల్ పిటిషన్లపై విచారణను జరిపిన అడిషనల్ సెషన్స్ జడ్జి డీడీ థక్కర్ విచారణ జరిపారు. బెయిల్‌ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చారు. తన రిటైర్మెంట్రోజే థక్కర్ ఈ తీర్పును వెలువర్చటం గమనార్హం. గతనెల 20న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీస్తా సెతల్వాడ్, శ్రీకుమార్‌ల బెయిల్ పిటిషన్లను వ్యతిరేకించింది. 2002 అల్లర్ల తర్వాత రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ లతో కలిసి కుట్ర పన్నిందని ఈనెల 15న దాఖలు చేసిన అఫిడవిట్లో గుజరాత్ పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ మాజీ ఎంపీ అహ్మద్ పటేల్ తరఫున ఈ కుట్ర జరిగినట్టు పోలీసులు ఆరోపిస్తున్న విషయం విదితమే. అయితే, తీస్తా సెతల్వాడ్, శ్రీకుమార్‌లు మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను వ్యతిరేకించారు.