Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను అస్థిరపరిచేందుకే...
- ఉపరాష్ట్రపతి ఎన్నికల నుంచి తప్పుకోవడంపై టీఎంసీ సమాధానం ఇవ్వాలి : మీడియాతో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : దేశంలో బీజేపీయేతర పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు మోడీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఆదివారం నాడిక్కడ హరి కిషన్ సింగ్ సుర్జీత్ భవన్ లో సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల పాటు జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం ముగిసిందని, ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి చర్చించామని అన్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామని, దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 1 నుంచి 15 వరకు కార్యక్రమాలు నిర్వహించాలని, జాతీయ పతాకాలు ఎగురవేస్తామని అన్నారు. కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అక్కడ బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. కేంద్ర ఏజెన్సీల ప్రయోగంతో పాటు అన్ని అంశాలపై చర్చించామని, దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు తమ పార్టీ మద్దతు ఉంటుందని, 14 ప్రతిపక్షాలు ఉమ్మడిగా ఆమెను బరిలోకి దింపామని తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నుంచి తప్పుకోవడంపై టీఎంసీ సమాధానం ఇవ్వాలన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు నిర్ణయించిన అభ్యర్థికి మద్దతుంటుందని మమతా బెనర్జీ అంగీకరించిన తరువాతే అభ్యర్థిని ప్రకటించామని, హఠాత్తుగా ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనమని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీఎంసీలో ఇటీవల కొన్ని రాజకీయ పరిస్థితులు చోటు చేసుకున్నాయని, సీనియర్ మంత్రి అవినీతి చర్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నుంచి ఎందుకు వెనక్కి తగ్గారో మమత సమాధానం చెప్పాలన్నారు.