Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2 కోట్ల మంది గ్యాస్ సిలిండర్‌కు దూరం
- తెలంగాణలో 6.57 లక్షల మంది.. ఏపీలో 6.19 లక్షల మంది
- రాజ్యసభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ధరలను నియంత్రించటంలో మోడీ సర్కారు విఫలం కావటంతో వంట గ్యాస్ వినియోగానికి వారు దూరమవుతున్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం ఎల్పీజీ వినియోగదారుల్లో రెండు కోట్ల మందికి పైగా ఒక్క సిలిండర్‌నూ (రీఫిల్) కొనలేదు. దేశంలో మొత్తం 30.95 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులున్నారు. ఈ విషయాన్ని కేంద్రం రాజ్యసభల్లో నివేదించింది. కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి సభకు లిఖితపూర్వకంగా సమాధానాన్నిచ్చారు.
దీని ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో 2.11 కోట్ల మంది వినియోగదారులు ఒక్క సిలిండర్‌నూ కొనుగోలు చేయలేదు. ఇందులో యూపీ నుంచి అత్యధికంగా 29.34 లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (17.50 లక్షల మంది), మహారాష్ట్ర (15.70 లక్షల మంది) ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో 6.57 లక్షల మంది, ఏపీలో 6.19 లక్షల మంది గ్యాస్ సిలిండర్‌ను కొనుగోలు చేయని వినియోగదారుల జాబితాలో ఉన్నారు.
తెలంగాణలో 1.18 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు
ఇక దేశవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగదారులు, గ్యాస్ సిలిండర్ కొనుగోలు సంఖ్య యూపీలో అధికంగా ఉన్నది. ఈ ఏడాది జులై 1 నాటికి యూపీలో 4,57,89,000 మంది వినియోగదారులున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (3 కోట్ల మంది), పశ్చిమ బెంగాల్ (2.61 కోట్ల మంది) రాష్ట్రాలున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కనెక్షన్ల సంఖ్య చూసుకుంటే.. తెలంగాణలో 1,18,33,000గా, ఏపీలో 1,47,92,000గా ఉన్నాయి.
2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.62 కోట్ల మంది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) వినియోగదారులు ఒక ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను తీసుకున్నారు. ఇదే సమయంలో రెండు సిలిండర్లు తీసుకున్న ఉజ్వల లబ్దిదారుల సంఖ్య 1.49 కోట్లుగా, మూడు సిలిండర్లు తీసుకున్నవారి సంఖ్య 4.95 కోట్లుగా ఉన్నది.