Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ సంక్షోభాన్ని దాచేస్తే.. శ్రీలంక తరహా పరిస్థితులు : రఘురామ్ రాజన్
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యాన్ని, అందులోని సంస్థల్ని బలోపేతం చేయడంలోనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఆర్థిక పురోగతికి ఇది ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఒక విభాగమైన 'ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్' ఐదో వార్షికోత్సవం రారుపూర్లో జరగగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. మెజార్టీవాదం బలపడి..ఒకదేశ రాజకీయ నాయకులు మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగ సంక్షోభాన్ని కప్పిపుచ్చాలనుకుంటే శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. పెద్ద సంఖ్యలో ఉన్న మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూపించే ప్రయత్నం చేస్తే అది దేశాన్నే విభజిస్తుందని వ్యాఖ్యానించారు. ఫలితంగా దేశ అంతర్గత వ్యవహరాల్లో విదేశీ జోక్యం కూడా చోటుచేసుకునే పరిస్థితి వస్తుందన్నారు.
''భారత ఆర్థిక వృద్ధికి ప్రజాస్వామ్య అవసరమెంత'' అనే అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో పురోగమించడం లేదని రాజన్ అభిప్రాయపడ్డారు. దేశ వృద్ధిరేటు మందగించడానికి కోవిడ్-19 సంక్షోభం ఒక్కటే కారణం కాదన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ వృద్ధి ఆశించిన స్థాయిలో లేదన్నారు. యువకులకు అవసరమైన స్థాయిలో ఉద్యోగాలు సృష్టించలేక పోవడమే దీనికి నిదర్శనమన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎంత ఆశతో ఎదురుచూస్తున్నారో చెప్పడానికి కొత్త సైనిక నియామకాల పథకం 'అగ్నిపథ్'పై చెలరేగిన ఆందోళనలే ఉదాహరణ అని వివరించారు. దేశంలో ఇప్పటికీ మెజార్టీ మహిళలు ఇంటికే పరిమితమవుతున్నారని తెలిపారు. అయినా ఉద్యోగాల్లో పోటీ ఈస్థాయిలో ఉండటం విచారకరమన్నారు. 35వేల రైల్వే ఉద్యోగాల కోసం 1.25 కోట్ల దరఖాస్తులు రావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.