Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2012 తర్వాత పెరగని వైనం
- వికలాంగులు, వితంతువులు, వృద్ధులు సహా కోట్లమందిపై ప్రభావం
- పెరిగిన ధరలు..పెరగని కేంద్ర సామాజిక పెన్షన్
- కనీస పెన్షన్ రూ.5వేలకు పెంచాలి.. : సామాజికవేత్తలు
న్యూఢిల్లీ : జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఏపీ) కింద వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలకు కేంద్రం ఇస్తున్న పెన్షన్ ఎంతో తెలుసా? కేవలం రూ.300. అది కూడా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాల్లో అర్హులైన 2.9 కోట్లమందికి సామాజిక పెన్షన్ నేడు అందుతోంది. పదేండ్ల క్రితం 2012లో పెన్షన్ మొత్తాన్ని కేంద్రం రూ.200 నుంచి 300కు పెంచింది. ఇప్పుడున్న ధరలకు, లబ్దిదారుల అవసరాలకు ఇది సరిపోతుందా? అనే కోట్లాది మంది లబ్దిదారులు ఆవేదన చెందుతున్నారు. ఎన్ఎస్ఏపీ కింద ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్, ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్, ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకాలు ఉన్నాయి. పదేండ్లుగా వీటి పెంపు లేకపోవటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పెన్షన్ పెంపుపై పదేండ్లుగా మోడీ సర్కార్ సమీక్ష చేయటం లేదు. ప్రతినెలా వచ్చే కేవలం రూ.300 ఏమూలకు సరిపోతాయని సామాజికవేత్తలు, ఎన్జీవో ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. కనీస పెన్షన్ రూ.5వేలకు పెంచాలని కోరుతున్నారు.
70ఏండ్ల వయస్సులో పనికి..
ఢిల్లీలోని జహింగీర్పూరీ కాలనీలో నివసించే హీరా దేవి మాట్లాడుతూ...''నా భర్త వయస్సు 70ఏండ్లు. పెరిగిన ధరలు, ఇంటి అవసరాల కోసం ఆయన ఈ వయస్సులో దినసరి కూలిగా పనిచేయాల్సి వస్తోంది. వృద్ధాప్య పెన్షన్‌గా ఇచ్చే రూ.300 కనీసం ఒక రోజు కుటుంబ ఖర్చుకు సరిపోదు. ఈ మొత్తాన్ని వెంటనే పెంచాల్సిన అవసరముంది'' అని అన్నారు. ఈ దేశంలో హీరా దేవి లాంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. కేంద్రం ఇచ్చే చిన్న సాయం వారికి ఎంతగానో తోడ్పతుందని, పెన్షన్ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సామాజికవేత్తలు అభిప్రాయపడుతు న్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు, ఆర్థికంగా కుదేలైనవారికి ప్రభుత్వ పెన్షన్ ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. సంక్షేమ పథకాల విషయంలో కేంద్రం ఇస్తున్నది చాలా తక్కువగా ఉందని ఆర్థిక నిపుణులు సైతం చెబుతున్నారు. దాంతో వివిధ రాష్ట్రాలు వేరుగా పెన్షన్ పథకాలు అమలుజేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
90శాతం మంది పేదలే
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రధాన కార్యదర్శి మురళీధరన్ మాట్లాడుతూ..''కేంద్రం ఇచ్చేది ఏమాత్రమూ సరిపోదని ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్..మొదలైన రాష్ట్రాలు సామాజిక పెన్షన్ పథకాల్ని వేరుగా అందజేస్తున్నాయి. కేంద్రం ఇచ్చే రూ.300ను మాత్రమే ఇచ్చే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సామాజిక పెన్షన్ ప్రతినెలా ఇచ్చేది కనీసం రూ.5వేలు ఉండాలి. కేంద్రం, రాష్ట్రాలు కలుపుకొని అయినా రూ.5వేలు ఉండేట్టు చూడాలి'' అని అన్నారు. ఎన్ఎస్ఏపీ కింద కేంద్రం అమలుజేస్తున్న వివిధ పెన్షన్ పథకంలో మొత్తం 2.9 కోట్లమంది లబ్దిదారులున్నారు. ఇందులో 90శాతం మంది ఏదైనా పనిచేస్తేనే కడుపు నిండే పరిస్థితులో ఉన్నారని 'హెల్ప్ ఏజ్ ఇండియా' హెడ్ అనుపమా దత్తా చెప్పారు. కనీస పెన్షన్ రూ.5వేలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం, రాష్ట్రాలు సంయుక్త కమిటీ ఏర్పాటుచేసి పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఇప్పుడున్న ధరలకు సరిపోదు
కేంద్రం ఇచ్చే రూ.300కు కలుపుకొని, ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా పెన్షన్ పథకాల్ని అమలుజేస్తు న్నాయి.బీహార్‌లో 60ఏండ్లవారికి వృద్ధాప్య పెన్షన్ కింద రూ.400, 80ఏండ్లు దాటిన వారికి రూ.500 అందజేస్తున్నారు. ఇది ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా.. రూ.550, రూ.850గా ఉన్నాయి. అత్యధికమంది వృద్ధుల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రూ.600(60 ఏండ్లవారికి), రూ.1000 (80ఏండ్లవా రికి) పెన్షన్‌గా ఇస్తున్నారు.
కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం, దేశంలోని మొత్తం వృద్ధుల్లో 50శాతం (2011 జనాభా లెక్కలను అనుసరించి) తీవ్రమైన పేదరికంలో ఉన్నారు. 60ఏండ్ల దాటిన వారు సుమారుగా 10.4కోట్లమం ది ఉన్నారని అంచనా. ఒక సర్వే ప్రకారం, మొత్తం 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వివిధ సామాజిక,ఆర్థిక నేపథ్యం ఉన్న 10వేల మంది వృద్ధుల నుంచి వివరాలు సేకరించారు.వృద్ధాప్య పెన్షన్ చాలా తక్కువగా ఉందని, ఇప్పుడున్న ధరలకు ఏమాత్రమూ సరిపోదని సర్వేలో పాల్గొన్న 94శాతం మంది వృద్ధులు ఆవేదన చెందుతున్నారని సర్వే పేర్కొన్నది.