Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజంతా నివాసంలో సోదాలు
ముంబయి : మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబయిలోని శివసేన నేత సంజయ్ రౌత్ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. దాదాపు తొమ్మిది గంటల పాటు ఆయనను ప్రశ్నించిన అనంతరం రౌత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్రాలపై పెత్తనాన్ని నిలదీసే సంజరు రౌత్ లక్ష్యంగా, కక్షపూరితంగా ఈడీతో దాడి చేయించారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముంబయి చాల్ను తిరిగి అభివృద్ధిపరచడంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసులో రౌత్‌ను ప్రశ్నించడానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. రౌత్ భార్య, అసోసియేట్ల ప్రమేయం కూడా వుందన్న ఈ కేసుకు సంబంధించి జులై 1న రౌత్ ఇడి ముందు హాజరయ్యారు. ఆ తర్వాత రెండుసార్లు ఈడీ సమన్లు జారీ చేసినా, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రౌత్ వాటిని అందుకోలేదు. ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారులు, సిఆర్పిఎఫ్ బలగాలతో కలిసి రౌత్ నివాసానికి చేరుకుని, సోదాలు ప్రారంభించారు.