Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్‌ను ప్రశ్నించిన అన్నదాతలు
- పంజాబ్, హర్యానాల్లో రైతుల ఆందోళన
- స్తంభించిన రైలు, రోడ్డు రవాణా
చండీగఢ్ : గత ఏడాది నల్ల చట్టాల రద్దు కోసం పోరాటం చేసిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, పంజాబ్, హర్యానాలో రైతులు ఆదివారం భారీ ఎత్తున ఆందోళనలకు దిగారు. సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టిన దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా ఈ ఆందోళనలు జరిగాయి. రైతుల ఆందోళన కారణంగా పంజాబ్, హర్యానాల్లోని పలు ప్రాంతాల్లో రైలు, రోడ్డు రవాణా స్తంభించింది. పంజాబ్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ రైల్ రోకో నిర్వహించారు. జలంధర్, ఫిల్లౌర్, ఫిరోజ్‌పుర్, భటిండాతో సహా అనేక పట్టణాల్లో రైతులు పట్టాలపై పడుకుని, రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో నాలుగు గంటల పాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రహదారులపై ధర్నాలు చేయడంతో రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని, లఖింపూర్ ఖేరీ హింసాకాండలోని బాధితులకు న్యాయం జరగాలనే డిమాండ్లతో రైతులు ఈ ఆందోళనలకు దిగారు. గత ఏడాది నల్లచట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ ఉద్యమంలో రైతులపై నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను నియమించే అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను కేంద్రం పట్టించుకోకపోవడంతోనే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని రైతు నాయకులు తెలిపారు.హర్యానాలో ని ఫిల్లార్ రైల్వే స్టేషన్లో నిరసనల్లో పాల్గొన్న బికెయు-కడియన్ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కడియన్ మాట్లాడుతూ, తమ డిమాండ్లను కేంద్రం పెడచెవిన పెట్టడంతోనే ఈ కార్యాచరణకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. బికెయు (ఏక్తా ఉగ్రహాన్) ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ కొక్రికలన్ మాట్లాడుతూ, ఆరు జిల్లాల్లో పది హైవేలపై గల 8 టోల్‌ప్లాజాల వద్ద తమ సభ్యులు ధర్నాలు నిర్వహించారని తెలిపారు. ముల్లాన్‌పూర్ వద్ద లూథియానా-ఫిరోజ్ పూర్ హైవేపై ధర్నా చేపట్టగా, భటిండా, బుదాల్డా, పట్టి, మలేర్కోట్లా వద్ద రైలు పట్టాలపై బైటాయించారు. తొలుత రహదారుల దిగ్బంధనాన్ని నిర్వహించాలని నిర్ణయించామని హర్యానాలోని పలువురు రైతులు తెలిపారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను, తీజ్ పండుగను పురస్కరించుకుని ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపారు.హర్యానాలోని హిస్సార్,జజ్జీర్, బహదుర గా, తొహనా, సోనిపట్, కర్నాల్‌తో సహా పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారు. కేంద్రం దిష్టిబొమ్మలను దగ్ధం చేసి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోనిపట్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించిన రైతులు కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.భారతీయ కిసాన్ సభ నేత షంషేర్ నంబార్ద ర్ మాట్లాడుతూ,ఇచ్చిన హామీలపై కేంద్రం వెనుకడు గు వేస్తోందని విమర్శించారు. హిస్సార్‌లో ఐదు టోల్ ప్లాజాల వద్ద రైతులు ప్రదర్శనలు నిర్వహించి, దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. బదోపట్టి టోల్ వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి సిద్ధపడుతుండ గా,పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది.