Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ
- కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులపై సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు ప్రచారోద్యమం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపు
న్యూఢిల్లీ : ఆగస్టు 1-15, భారతదేశ స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, పార్టీ అన్ని కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలనీ, రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేయాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. స్వాతంత్య్ర పోరాటం, ప్రజాస్వామ్య రక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛ, భారతదేశ లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కమ్యూనిస్టుల అద్భుతమైన పాత్ర పోషించారని తెలిపింది. ప్రజల జీవనోపాధిపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు ప్రచారోద్యమం నిర్వహించాలనీ, ప్రతి రాష్ట్రంలో నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర కమిటీలు రూపొందించాలని తెలిపింది. కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలను కూడా ఈ ప్రచారంలో హైలైట్ చేయాలని తెలిపింది. పార్టీ కేంద్ర కమిటీ జూలై 30, 31 తేదీలలో న్యూఢిల్లీలో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించి క్రింది ప్రకటనను విడుదల చేసింది.
సీపీఐ(ఎం) 23వ మహాసభ ముగిసిన తరువాత గత నాలుగు మాసాలుగా నయా-ఉదారవాద విధానాలు, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, మతోన్మాదం వంటి వాటిని దూకుడుగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ఫాసిస్ట్ ఆరెస్సెస్ హిందుత్వ ఎజెండా దూకుడు పెంచడం ఇవన్నీ మన అంచనా సరైనదేనని రుజువు చేస్తున్నాయి. కార్పొరేట్ - మతతత్వ శక్తుల పొత్తు భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడమే గాక ప్రజలపై అసాధారణ భారాలను మోపుతోంది.
కట్టలు తెంచుకున్న ద్రవ్యోల్బణం
టోకుధరలు, వినియోగదారీ ధరల సూచీలు రెండూ రికార్డు స్థాయిలో పెరగడంతో ధరలు చుక్కలనంటుతూ ప్రజల జీవనోపాధిని నాశనం చేస్తున్నాయి. వారి కొనుగోలు శక్తిని తగ్గించేస్తునాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మరింత పడిపోయేలా చేస్తుంది. దేశీయంగా గిరాకీ తగ్గడం వల్ల ఉత్పాదక కార్యకలాపాలు తగ్గుముఖం పడుతున్నాయి, ఇది ఆర్థిక వ్యవస్థ మరింత మాంద్యంలోకి జారుకునేలా చేయడమేగాక, .ఉద్యోగాలు కోల్పోవడానికి కూడా దారితీస్తోంది.
ఆహార, ఇంధన ధరలు నిరంతరం పైపైకి ఎగబాకుతుండడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంధన ధరలు ఈ ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నాయి. ఇది చాలదన్నట్టు తాజాగా జీఎస్టీ పెంపుతో రోజువారీ వినియోగానికి సంబంధించిన అన్ని నిత్యావసర వస్తువుల ధరలు మరింతగా పెరిగేందుకు దారి తీసింది. అధిక ధరలకు ఆజ్యం పోసే జీఎస్టీ పెంపు, పెట్రోలియం ఉత్పత్తులపై సెస్/సర్‌చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. ప్రజలపై భారం మోపే బదులు మోడీ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి అత్యంత సంపన్నులపై పన్ను విధించాలి.
రికార్డు స్థాయిలో నిరుద్యోగం
20-24 ఏండ్ల మధ్య వయస్కులలో 42 శాతం నిరుద్యోగిత ఉంది. 90 కోట్ల మంది పని చేయగల వయసున్న జనాభాలో (2020 నాటికి ) 61.2 శాతం మంది ఉద్యోగాల కోసం వేట మానేశారు. కార్మిక భాగస్వామ్య రేటు రికార్డు స్థాయిలో పడిపోయింది మోడీ ఎనిమిదేండ్ల పాలనలో మహిళల పరిస్థితి మరీ దారుణం. 38.8 శాతం-మహిళలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నారు. కేవలం 0.33 శాతం దరఖాస్తుదారులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు మోడీ ప్రభుత్వం పార్లమెంటులో అంగీకరించింది. ఇప్పటికీ పది లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి.
మోడీ ప్రభుత్వం తక్షణమే అన్ని ఖాళీలను భర్తీ చేయాలి, జాతీయ ఉపాధి హామీ కోసం కేటాయింపులను గణనీయంగా పెంచాలి మరియు మన యువత మరియు జనాభా డివిడెండ్‌ను వధా చేయడం ఆపాలి.
గిరిజనుల హక్కులపై దాడులు
గ్రామసభలు, గిరిజన సమాజం, ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల హక్కులను తొలగించేలా అటవీ సంరక్షణ చట్ట నిబంధనలకు తెచ్చిన సవరణలను వెంటనే వెనిక్క తీసుకోవాలని కేంద్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రైవేట్ కార్పొరేట్లకు గరిష్ట లాభాలు చేకూర్చేందుకు అటవీ భూములను మళ్లించడానికి ముందు గిరిజనుల ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తున్న నిబంధనలకు తూట్టు పొడుస్తోంది. ఈ చర్య అడవుల విధ్వంసం వాతావరణ మార్పులపై మరింత వినాశకరమైన ప్రభావం కలుగజేస్తుంది.
పూర్తి స్థాయి నిరంకుశత్వం
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడంలో, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడంలో ఈడీ, సీబీఐలు మోడీ ప్రభుత్వానికి రాజకీయ సాధానాలుగా పని చేస్తున్నాయి. కొంతకాలం తర్వాత పదవీ విరమణ చేయనున్న ఒక న్యాయమూర్తి నేతత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఇటీవలి ఇచ్చిన తీర్పు, పిఎంఎల్‌ఎకి 2019లో తెచ్చిన సవరణలు దీనిని మరింత ప్రాణాంతకమైన సాధనంగా చేస్తుంది. ప్రజాస్వామ్యంపై ఇది ఘోరమైన దాడి అని కేంద్ర కమిటీ పేర్కొంది.
పార్లమెంట్‌పై దాడి
ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ముఖ్యమైన ప్రజల సమస్యలపై ఎలాంటి కీలక తీర్మానాన్ని చర్చకు అనుమతించకుండా మోడీ ప్రభుత్వం చేపట్టిన వైఖరి పార్లమెంట్‌పై అసాధారణమైన దాడిగా కేంద్ర కమిటీ పేర్కొంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో 27 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం స్వతంత్ర భారతదేశంలో కని విని ఎరుగని దారుణ సంఘటన.
మానవ హక్కులు, పౌర హక్కుల కోసం గట్టిగా పోరాడుతూ, మతతత్వానికి వ్యతిరేకంగా సాహసోపేతమైన వైఖరి తీసుకున్న తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేసిన తీరును కేంద్ర కమిటీ ఖండిస్తోంది. మళ్లీ అదే న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆమె అరెస్టును ప్రేరేపించే విధంగా తీర్పు ఇచ్చింది.
జుబేర్ అహ్మద్‌ను అహేతుకమైన కారణాలతో అరెస్టు చేసిన తీరు చూస్తుంటే మోడీ ప్రభుత్వ హయాంలో హింసకు దారితీసే ద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహించేవారికి, హింసను రెచ్చగొట్టేవారికి ప్రభుత్వ రక్షణ ఉంటుందని, ఆ విద్వేష ప్రసంగాల బండారాన్ని బట్టబయలు చేసి, ప్రజల ముందు నిజాలు ఉంచేవారు కటకటాల వెనక ఉండాల్సి వస్తుందని మోడీ సర్కార్ సంకేతమిస్తున్నది.
భీమా కోరేగావ్ ఖైదీలు మూడేండ్లుగా జైల్లో మగ్గుతున్నారు. క్రూరమైన నిర్బంధ చట్టాల కింద జర్నలిస్టులు, విద్యార్థులతో సహా అనేక మంది నిర్బంధించబడ్డారు. తీస్తా సెతల్వాద్, ఆర్బి శ్రీకుమార్, భీమా కోరేగావ్ నిర్బంధంలో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని కేంద్ర కమిటీ డిమాండ్ చేసింది.
మతతత్వ సమీకరణతో పొంచి ఉన్న ముప్పు
అనేక రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు, మైనారిటీ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని, అధికార పార్టీ ఆధ్వర్యంలో హిందుత్వ సంస్థలు మత సమీకరణ కోసం దాడులు, బెదిరింపులతో పెట్రేగుతుండడాన్ని కేంద్ర కమిటీ ఖండిస్తోంది. ఢిల్లీ, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలలో పెద్ద ఎత్తున బుల్డోజర్ రాజకీయాలను మోహరించడం మతపరమైన సమీకరణలకు మరింత పదును పెట్టింది. మన లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర శిథిలాలపై హిందూత్వ రాష్ట్ర లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజల్లో హిందుత్వను రెచ్చగొట్టేందుకు ఆర్ఎస్ఎస్/బీజేపీ యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ద్వేషం, హింస, విషపూరిత ప్రచారం చేస్తూ హింసను రెచ్చగొడుతున్నాయి.
కొత్త పార్లమెంట్ భవనం పైన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో ప్రధానమంత్రి హిందూ మతపరమైన ఆచారాన్ని నిర్వహించడం ద్వారా భారత గణతంత్ర రాజ్యంపై దాడి మరోసారి స్పష్టమైంది. ఇది భారత రాజ్యం, ప్రభుత్వాన్ని హిందూత్వకు ప్రతీకగానే చూపడం తప్ప భారత రాజ్యాంగంతో కాదు.
భారత రాజ్యాంగం, లౌకిక ప్రజాస్వామ్యం , మన ప్రజల ప్రజాస్వామిక హక్కులు, పౌర స్వేచ్ఛల హామీని రక్షించుకునేందుకుకలసికట్టుగా అందరూ ఉద్యమించాలనిలౌకిక భావాలు గల వ్యక్తులు శక్తులందరికీ కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.
కేరళ పరిణామాలు
కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడాన్ని సీసీ తీవ్రంగా ఖండించింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వం, సీఎంను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ వరుస ఆందోళనలను చేపడుతోంది. ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది బీజేపీతో జతకడుతున్నది.
సెంట్రల్ పూల్ ఆదాయంలో తన చట్టబద్ధమైన వాటాను కేరళకు ఇవ్వడానికి తిరస్కరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత వైఖరిని, వ్యూహాలను కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది, ఇది తీవ్రమైన వనరుల కొరతవైపు కేరళను నెడుతోంది. ఎల్డీఎఫ్ ప్రభుత్వం, దాని ప్రత్యామ్నాయ ప్రజా అనుకూల విధానాలకు మద్దతుగా దేశవ్యాప్త ప్రచారాన్ని నిర్వహించాలని, ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని,, వివక్షాపూరిత వైఖరిని ఖండించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.
త్రిపుర పరిణామాలు
త్రిపురలో బీజేపీ తన రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధనంగా చేసుకుని ప్రజలపైన ముఖ్యంగా త్రిపురలో సీపీఐ(ఎం) , దాని కార్యకర్తలపైన చేస్తున్న ఫాసిస్ట్ దాడులను కేంద్ర కమిటీ ఖండించింది. మరికొద్ది నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చింది. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ప్రజలను నిరోధించేందుకు భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. బీజేపీ ప్రభుత్వం , దాని భయానక రాజకీయాలు , మత సమీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులను పెద్దయెత్తున సమీకరించేందుకు ప్రచారాందోళన చేపట్టాలని సీపీఐ(ఎం) నిర్ణయించింది.
బెంగాల్ పరిణామాలు
ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో పార్థ ఛటర్జీ అరెస్టు కావడంతో టీఎంసీ ప్రభుత్వ హయాంలో హింసాత్మక రాజకీయాలతోబాటు అవినీతి ఎంత తీవ్రస్థాయిలో వేళ్లూనుకున్నదో తెలియజేస్తోంది. మంత్రి అరెస్టు నేపథ్యంలో ఆయనను తొలగించక తప్పలేదు. ఈ ఉదంతం టీఎంసీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక స్వభావాన్ని మరోసారి తేటతెల్లం చేసింది. నారద, శారద మరియు ఇతరుల మునుపటి చిట్ ఫండ్ స్కామ్‌లు బీజేపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కొనసాగించడం లేదు. రాష్ట్రంలో సీపీిఐ(ఎం), లెఫ్ట్ ఫ్రంట్లు పభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన కార్యక్రమాలు ప్రజల ఆదరణను పొందాయి.