Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో వామపక్ష ఎంపీల ఆందోళన
- నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత
న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలకు వ్యతిరేకంగా వామపక్ష ఎంపిలు సోమవారం పార్లమెంట్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. డీఎంకే ఎంపీలు మద్దతు తెలిపారు. ''ఉపాధి హామీని కాపాడాలి, ఉపాధి హామీ కార్మికుల వేతనాలు పెంచాలి, పెండింగ్ నిధులను విడుదల చేయాలి, ఉపాధి హామీకి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి, పని దినాలు పెంచాలి'' అంటూ పక్లార్డులు పట్టుకొని నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ స్కీమ్‌లో భారీగా నిధుల కోత విధించిందని విమర్శించారు. ఉపాధి హామీ నిధులు విడుదల చేయటం లేదనీ, భారీగా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఎంపీలు పిఆర్ నటరాజన్, ఎఎం ఆరీఫ్, వి.శివదాసన్, జాన్ బ్రిట్టాస్, ఎఎ రహీం, సీపీఐ ఎంపీలు బినరు విశ్వం, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. మరోవైపు రాజ్యసభలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై చర్చించాలని సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ రాజ్యసభ ఛైర్మన్‌కు రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు.
కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన
నలుగురు లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. గత మంగళవారం నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, జ్వోతిమణి, టిఎన్ ప్రతాపన్, రమ్యహరిదాసులు సస్పెండ్‌కు గురయ్యారు. ఆగస్టు 12 వరకు వారిని పార్లమెంట్ సభ కార్యకలాపాల నుంచి పూర్తిగా సస్పెండ్ చేశారు. అయితే దాదాపు వారం రోజుల తరువాత సోమవారం వారిపై సస్పెన్షన్‌ను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఎత్తివేశారు. మరోవైపు సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలనీ, ధరల పెరుగుదల, ఆహార పదార్థాలపై జీఎస్టీ విధిండాన్ని వ్యతిరేకిస్తూ 11వ రోజు కూడా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో వెంటనే మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది.
తిరిగి ప్రారంభమైన లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేశారు. ఈ ప్రతిపాదనను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిపాదించారు. సస్పెన్షన్‌ను ఉపసంహరించుకునే ముందు, సభలోకి ప్లకార్డులు తీసుకురాబోమని బిర్లా ప్రతిపక్ష సభ్యుల నుంచి హామీ తీసుకున్నారు. అనంతరం ధరలు పెరుగుదలపై చర్చ జరిగింది. రాజ్యసభలో కూడా ఇదే తంతూ నడిచింది. సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రాజ్యసభలో శివసేన ఎంపీలు ఆందోళన చేశారు. వీరి నిరసనలో టీఎంసీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. సభ ప్రారంభమైన నిమిషానికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే సామూహిక విధ్వంసం, ఆయుధాల నిధులను నిషేధించే బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అలాగే అంటార్కిటిక్ పర్యావరణాన్ని రక్షించడానికి, అంటార్కిటిక్ ఒప్పందాన్ని అమలు చేయడానికి భారత అంటార్కిటిక్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం సభ నేటీ (మంగళవారం)కి వాయిదా పడింది.