Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలపై పెరిగిన భారాలు
- ఉపాధి వేతనాలు ఇవ్వటం లేదు
- ఈడీకి అధికారాలిస్తూ ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలి : మీడియా సమావేశంలో సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ జాతీయ ఆస్తులను లూటీ చేస్తున్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఒకపక్క ప్రజలపై భారాలు పెంచి, మరోపక్క కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నదని ఆరోపించారు. సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో సోమవారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీతారాం ఏచూరి మాట్లాడారు. స్వాతంత్రోద్యమంలో ఎటువంటి పాత్ర లేనివారు కూడా ఇప్పుడు జాతీయ జెండాలు ఎగుర వేయాలని పిలుపునిస్తున్నారని విమర్శించారు. సంపూర్ణ స్వరాజ్యం పిలుపును 1920లో మొదటిసారిగా కమ్యూనిస్టులే ఇచ్చారనీ, 1929లో గాంధీజీ కూడా తప్పక దానికి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని గుర్తు చేశారు. దేశంలో మహా ధనవంతులు లాభాలు గడిస్తున్నారనీ, రూ.ఏడు లక్షల కోట్లు రాయితీలు పొందారని తెలిపారు. వారి ఆస్తులు మూడు రెట్లు పెరిగాయనీ, మరోవైపు పేదలు మరింత పేదలుగా మారుతున్నారని అన్నారు. ఉపాధి వేతనాలు ఇవ్వటం లేదనీ, ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుందని విమర్శించారు. ఈడీకి అధికారాలు ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అన్ని ప్రతిపక్షాలతో కలిసి చర్చిస్తామని అన్నారు. దీనిపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇది పున:సమీక్షించాల్సిన తీర్పేనని అభిప్రాయపడ్డారు. ఈడీ చట్టానికి సవరణలు చేస్తూ 2019లో బిల్లు ఆమోదించారనీ, ఈడీకి ఎక్కువ అధికారాలు ఇవ్వబడ్డాయని గుర్తుచేశారు. దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారని తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను ప్రకటించిన తరువాత, ప్రతిపక్షాల మద్దతు తగ్గిందనటంలో ఏమాత్రం వాస్తవం లేదనీ, ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందన్నారు. కానీ 1952 నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షాల అభ్యర్థులందరీ కంటే యశ్వంత్ సిన్హాకు ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి కోసం ముందుగా మమతా బెనర్జీతో చర్చించలేదనేది వాస్తవం కాదనీ, అన్ని పార్టీలతో చర్చించామని తెలిపారు. మమతా బెనర్జీతో శరద్ పవర్, సోనియా గాంధీ మాట్లాడారని చెప్పారు. ఆమె కూడా ప్రతిపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తానని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఉన్నట్టుండి వెనక్కి తగ్గడం వెనుక మర్మమేంటో అర్థం కావటంలేదన్నారు.