Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్లుకు వ్యతిరేకంగా 9న భారీ ప్రదర్శన
- ఆమోదిస్తే అదే రోజు విధుల బహిష్కరణ
- బిల్లును పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపాలి
- విద్యుత్ కార్మికుల జాతీయ సదస్సు నిర్ణయం
- వివిధ పార్టీల ఎంపీల సంఘీభావం
న్యూఢిల్లీ : విద్యుత్ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఏకపక్ష ప్రయత్నాలను నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీఓఈఈఈ) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు మంగళవారం కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఎన్సీసీఓఈఈఈ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికుల జాతీయ సదస్సు జరిగింది. విద్యుత్ ఉద్యోగులకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. క్విట్ ఇండియా ఉద్యమ 80వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 9న బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది. అన్ని జిల్లాలు, ప్రాజెక్టు హెడ్‌క్వార్టర్స్‌లో విద్యుత్ ఉద్యోగులు పెద్దఎత్తున నిరసనలు తెలుపుతూ ఆందోళనలు నిర్వహించాలని సదస్సులో నిర్ణయించారు. విద్యుత్ కార్మికులు, విద్యుత్ వినియోగదారులతో సవివరంగా చర్చించకుండా విద్యుత్ చట్టం 2003ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ (సవరణ) బిల్లు 2022ను పార్లమెంటు ఆమోదించుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న 27 లక్షల మంది విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు వెంటనే పనిని నిలిపివేస్తామని స్పష్టం చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సదస్సు తీర్మానాన్ని ఆమోదించింది.ఆలిండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్, ఆలిండియా పవర్ డిప్లొమా ఇంజనీర్స్ ఫెడరేషన్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా పవర్ మెన్ ఫెడరేషన్, ఇండియన్ నేషనల్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులతో కూడిన అధ్యక్షవర్గం సదస్సుకు అధ్యక్షత వహించింది. ఈ సదస్సులో అనేక ప్రధాన రాజకీయ పార్టీల ఎంపీలు హాజరయ్యారు. విద్యుత్ (సవరణ) బిల్లును ప్రజా వ్యతిరేక బిల్లుగా అభివర్ణిస్తూ విద్యుత్ కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఎలమారం కరీం (సీపీఐ(ఎం)), సంజరు సింగ్ (ఆమ్ ఆద్మీ పార్టీ), ఎం. షణ్ముగం (డీఎంకే), బినోరు విశ్వం (సీపీఐ), డోలా సేన్ (టీఎంసీ) తదితర పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. విద్యుత్ (సవరణ) బిల్లును పెద్ద ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉపసంహరించుకోవాలనీ, విద్యుత్ చట్టం 2003ని సవరించాల్సిన అవసరం ఉన్నట్లయితే, ప్రధాన వాటాదారులు విద్యుత్ ఉద్యోగులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వినియోగదారులు సవరణ బిల్లుతో వివరంగా చర్చించాలి. దీని కోసం బిల్లును విద్యుత్ వ్యవహారాలపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ (సవరణ) బిల్లులోని ప్రజా వ్యతిరేక నిబంధనలకు వ్యతిరేకంగా కోఆర్డినేషన్ కమిటీ తరపున ఆలిండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ చైర్మన్ శైలేంద్ర దూబే ప్రధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విద్యుత్ (సవరణ) బిల్లుతో ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని ప్రయివేట్ కంపెనీలకు లాభాలు ఆర్జించేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలని తీర్మానంలో పేర్కొన్నారు. సామాన్య ప్రజల సొమ్ముతో వేలకోట్ల రూపాయలను వెచ్చించి ఈ విద్యుత్ పంపిణీ సంస్థల నెట్‌వర్క్‌ను సృష్టించారు. ఈ బిల్లు ప్రకారం, ప్రయివేట్ కంపెనీలు ప్రభుత్వ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటాయి. లాభదాయకమైన వినియోగదారులకు, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు మాత్రమే విద్యుత్‌ను అందించటంతో లాభాలను ఆర్జిస్తాయని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రయివేట్ కంపెనీలు రైతులు, గృహ వినియోగదారులకు విద్యుత్‌ను అందించవు. సవరణ బిల్లు ప్రకారం సబ్సిడీ, క్రాస్ సబ్సిడీని రద్దు చేయాలనీ, దీనివల్ల 7.5 హార్స్‌పవర్‌తో కూడిన పంపింగ్ సెట్‌ను వినియోగిస్తున్న సామాన్య రైతు రూ.లక్షకు పైగా బిల్లు చెల్లించాల్సి వస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. కేవలం 6 గంటల పాటు పంపింగ్ సెట్‌ను నడపడానికి నెలకు రూ.10 వేల బిల్లు కట్టాల్సి వస్తుంది.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న, సాధారణ గృహ వినియోగదారులు పొందుతున్న విద్యుత్తుకు ఖరీదు అయిపోతుంది. ఈ సదస్సుల్లో ఎన్సీసీఓఈఈఈ కన్వీనర్ ప్రశాంత నంది చౌదరి, నేతలు శైలేంద్ర దుబే, పదమ్జిత్ సింగ్, ఆర్. త్రివేది, మోహన్ శర్మ, సమర్ సిన్హా, కుల్దీప్ కుమార్, పి. రత్నాకర్ రావు, అభిమన్యు ధంకర్, కె. అశోక్ రావు, సుభాష్ లాంబా, ఎస్.ఎస్ సుబ్రమణియన్, ఎస్. హరిలాల్, గణనాథ్ దాస్, కృష్ణ భోయూర్, ఆర్.కె శర్మ, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్‌మొల్లా, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు ప్రసంగించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం నుంచి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ వెంకటేశ్వర్లు, జి.సాయిబాబు, ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నుంచి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి. చంద్రశేఖర్, గణపతి విఎస్ఆర్కె, గౌరవ అధ్యక్షులు ఎం.జగదీష్ పాల్గొన్నారు.