Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహారపదార్థాలపై 5శాతం జీఎస్టీ ఏకగ్రీవం కాదు
- కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి : రాజ్యసభలో సీపీఐ(ఎం) పక్షనేత ఎలమారం కరీం
న్యూఢిల్లీ : సామాన్యులపై భారాలు విధిస్తూ... సంపన్నులకు మాత్రం రాయితీలు ఇస్తారా..? అంటూ సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత ఎలమారం కరీం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం రాజ్యసభలో ధరల పెరుగుదలపై జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరపున కరీం మాట్లాడారు. ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీని ఏకగ్రీవంగా సబ్‌కమిటీ ప్రతిపాదించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారని, అది వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఆ కమిటీలో కేరళ ఆర్థిక మంత్రి కూడా ఒక సభ్యుడనీ, 5శాతం జీఎస్టీ ఏకగ్రీవ నిర్ణయం కాదని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఏకపక్ష ప్రకటన చేశారనీ, వెంటనే ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రికి తమ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి లేఖలు రాశారని గుర్తు చేశారు. బంగారం, డైమాండ్స్పై 1.5శాతం జీఎస్టీ ఉందని, కానీ ఆహార పదార్థాలపై 5శాతం జీఎస్టీ విధించారని విమర్శించారు. ఇదేమీ న్యాయమని ప్రశ్నించారు.
దేశంలోని మెజార్టీ ప్రజానీకంపై తీవ్ర ప్రభావం పడుతున్న చాలా ముఖ్యమైన అంశం చర్చిస్తున్నాం. నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఎనిమిదేండ్ల మోడీ పాలన కూరగాయల నుంచి వంట గ్యాస్ వరకు అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. దేశంలో ఎక్కువ మంది తినే బియ్యం, గోధుమల ధరలు గత ఐదేండ్లుగా 24శాతం పెరిగాయని అన్నారు. మరోవైపు గోధుమలు 28శాతం, పప్పులు 20 నుంచి 30శాతం ధరలు పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపిందని గుర్తు చేశారు. వంట నూనె ధరల పెరుగుదల గురించి చెప్పనవసరం లేదనీ, ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. వేరుశెనగ నూనె 41శాతం, ఆవా నూనె 71శాతం, వనస్పతి నూనె 112శాతం, సన్‌ప్లవర్ 107శాతం, పామాయిల్ నూనె 128శాతం ధరలు పెరిగాయని వివరించారు. దేశంలో ప్రతి కుటుంబం వంట నూనె వాడకుండా ఉండదనీ, ధరలు పెరుగుదలతో వారి ఖర్చులు పెరిగాయని తెలిపారు. గత ఐదేండ్లలో బంగాళదుంప 65శాతం, ఉల్లిపాయలు 69శాతం, టమోటా 155శాతం ధరలు పెరిగాయన్నారు. ఇవే కాకుండా అన్ని నిత్యావసర వస్తువుల పెరుగుదల చాలా తీవ్రంగా ఉందని అన్నారు. ఈ కాలంలో పాలు 25 శాతం, సాల్ట్ 28 శాతం ధరలు పెరిగాయని తెలిపారు.
చాలా ఏండ్లుగా దేశంలోని రైతులు రికార్డు స్థాయిల్లో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదికలు చెబుతున్నాయనీ, అలాగే పండించిన పంటకు మద్దతు ధర కోసం రైతులు ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. మరోవైపు ధరల పెరుగుదలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలోకి వంట నూనె, పప్పులు, సాల్ట్, పాలు వంటి నిత్యావసర వస్తువులను ఎందుకు తీసుకురాకూడదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఫ్రీ మార్కెట్‌కు కట్టుబడి ఉందని, పీడీఎస్‌ను విస్తరించే ఆలోచనను తిరస్కరించిందని విమర్శించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి (2016) నుంచి 16 వస్తువులను పీడీఎస్ ద్వారా సరఫరా చేస్తున్నామని, వాటి ధరలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని తెలిపారు. ఏడేండ్ల తరువాత కూడా పప్పులు, ఇతర అన్ని నిత్యావసరల వస్తువుల ధరల్లో మార్పు లేదన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్ ధరలు పెరిగాయని అన్నారు. గత 75 ఏండ్లలో బియ్యం, గోధుమలు, పప్పులు వంటి ఆహార పదార్ధాలు, పెరుగు, పాలు, పన్నీర్, మాంసం, చేపలు వంటి రోజు నిత్యావసర పదార్థాలపై ఎప్పుడు పన్ను వేయలేదని అన్నారు. ఇవన్ని పన్నుకు మినహాయింపుగా ఉండేవనీ, కానీ ఇప్పుడు జీఎస్టీ పరిధిలోకి తీసుకెళ్లారని తెలిపారు. స్మశాన వాటిక, హాస్పటల్ రూమ్స్, రాసే ఇంకు వంటి వాటిపై కూడా పన్ను వేశారనీ, బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము విత్‌డ్రా చేసుకోవాలంటే, చెక్కులపై 18 శాతం పన్ను విధించడం ఎంత దౌర్భాగ్యమని అన్నారు. ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయకుండా, మహా ధనవంతులు పన్నులు వేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు రుణమాఫీ, పన్ను రాయితీలు ఇవ్వకూడదని, లగ్జరీ వస్తువులపై జీఎస్టీ వేయాలని సూచించారు.