Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12న విచారణ!
- నివేదికలో ఏముందన్నదానిపై సర్వత్రా ఆసక్తి
న్యూఢిల్లీ : పెగాసస్ కుంభకోణంపై తుది నివేదికను ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలోని కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ కుంభకోణానికి సంబంధించి సాంకేతిక అంశాల్లో వాస్తవాల్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు గత ఏడాది ఈ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కేసులో కీలకమైన అంశాలు నివేదికతో ముడిపడి ఉన్నాయి. నివేదికలో ఏముందన్నది ప్రస్తుతానికి అత్యంత రహస్యం. పెగాసస్‌పై సుప్రీం విచారణ కొద్ది రోజుల్లో చేపట్టనున్నదని తెలిసింది. న్యాయమూర్తులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలపై మోడీ సర్కార్ అక్రమ పద్ధతిలో నిఘా చర్యలకు దిగిందని, అందుకోసం ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ తయారుచేసిన 'పెగాసస్' సాఫ్ట్‌వేర్‌తో నిఘా కార్యకలాపాలు సాగించిందని కేంద్రంపై ఆరోపణలు వెలువడ్డాయి. అంతర్జాతీయ మీడియా సంస్థల్లోని జర్నలిస్టులు, ద వైర్...పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా ఈ కుంభకోణాన్ని తొలుత బయటపెట్టాయి.అయితే ఈ కుంభకోణానికి సంబంధించి కీలకమైన సాంకేతిక అంశాల్ని తేల్చాల్సిందిగా రవీంద్రన్ కమిటీని అక్టోబర్ 2021లో సుప్రీం నియమించింది. పెగాసస్ కుంభకోణంపై విచారణ జరపాలని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేసు విచారణలో కమిటీ నివేదిక కీలక భూమిక పోషించనున్నది. సీజేఐ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం పెగాసస్‌పై విచారణ జరుపుతోంది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 12న ఉండొచ్చని సమాచారం! ఇంతకు ముందు వాదోపవాదనల సందర్భంగా సుప్రీం కోరిన సమాచారాన్ని ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది జాతీయ భద్రత, ప్రయోజనాలు కారణంగా చూపింది. అయితే దీనిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జాతీయ భద్రత, ప్రయోజనాలు పేరు చెప్పి జవాబుదారీతనం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదని సీజేఐ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయకపోవటంపై కేంద్రం తీరును తప్పుబట్టారు.ద వైర్ వ్యవస్థాపక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్, ఎ.కె.వేణు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, అభిషేక్ బెనెర్జీ, క్యాబినెట్ మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పటేల్..మొదలైనవారిపై పెగాసస్ నిఘా నిజమేనని తేలింది. మిలటరీ గ్రేడ్ నిఘా సాఫ్ట్‌వేర్‌తో కేంద్రం ఎవరెవరిపై నిఘా చర్యలు చేపట్టిందో ద వైర్ 174మందితో ఒక జాబితా సైతం విడుదల చేసింది. పెగాసస్‌ను కేవలం ఆయా దేశాల ప్రభుత్వాలకే అమ్ముతామని, ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వమని ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో కూడా ప్రకటించింది. దాంతో మోడీ సర్కార్‌పై అనుమానాలు బలపడ్డాయి. పెగాసస్‌ను ఇజ్రాయెల్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిందనేందుకు బలమైన ఆధారాలున్నాయి.ఉగ్రదాడులు..మొదలైనవాటిని అడ్డుకునేందుకు ఏ దేశంలోనైనా ప్రభుత్వాలు పెగాసస్ వంటి నిఘా చర్యలు చేపట్టవచ్చు. దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ లేవు. కానీ ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక, హక్కుల కార్యకర్తలు, న్యాయమూర్తులపై ప్రయోగించటం నేరపూరితమైన చర్యేనని నిపుణులు చెబుతున్నారు.