Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 150 మందికి పైగా మహిళా కార్మికులకు అస్వస్థత
విశాఖపట్నం : ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లోని సీడ్స్ దుస్తుల కంపెనీలో మళ్లీ విషవాయువు లీకైంది. 150 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఎం-1 యూనిట్లో మహిళా కార్మికులు వాంతులు, కళ్లు తిరగడంతో కిందపడిపోయారు. బాధితులను అచ్యుతాపురం, అనకాపల్లి ఆస్పత్రులకు తరలించారు. కొంతమంది కార్మికులు నోటి నుంచి నురగలు రావడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో కొందరు కార్మికులు పరుగులు తీశారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆందోళనకు గురైన కార్మికుల కుటుంబ సభ్యులు కంపెనీ వద్దకు, ఆస్పత్రులకు చేరుకున్నారు. విషవాయువు బారినపడి పడిన కార్మికుల సంఖ్య పెరిగే అవకాశముంది. కంపెనీ ప్రాంగణంలో కార్మికులకు ప్రాథమిక చికిత్స అందించి ఆ తర్వాత వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు.
బాధితులకు ఏపీ సీఐటీయూ నాయకులు పరామర్శ
సీఐటీయూ అనకాపల్లి జిల్లా కార్యదర్శి రొంగలి రాము, అచ్యుతాపురం సీఐటీయూ కార్యదర్శి కె.సోమునాయుడు కంపెనీ వద్దకు చేరుకొని బాధితులను ఆస్పత్రులకు తరలించేందుకు సహాయపడ్డారు. అనకాపల్లిలోని ఎన్టిఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీఐటీయూ నాయకులు వి.వి.శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యనారాయణ, ఎ.బాలకృష్ణ పరామర్శించారు.
గత ప్రమాదంపై నివేదికను బయటపెట్టని ప్రభుత్వం
ఈ ఏడాది జూన్ మూడున ఇదే కంపెనీలో విషవాయువుల లీకేజీతో 369 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందుకు కారణాలు వెల్లడికాకముందే మరోసారి ఈ కంపెనీలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. అప్పట్లో జరిగిన గ్యాస్ లీకేజీపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి), జాయింట్ కమిటీ నివేదికలు సమర్పించాయి. వీటిని బయటపెట్టకుండానే కంపెనీని తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నివేదికను బహిర్గతం చేయకపోవడంతో ఏ కారణంగా ఎక్కడ ప్రమాదం చోటుచేసుకుందన్న విషయం ఇప్పటికీ తెలియడం లేదు. ఆ నివేదికను బయటపెట్టి లోపాలను సరిచేసి ఉంటే మళ్లీ వాయువు లీకై ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సీడ్స్ కంపెనీలో జరిగిన ప్రమాద నివేదికలను బయటపెట్ట కుండా దాచిపెట్టింది. విచారణకు ఆదేశించామని, నివేదికలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అప్పట్లో ప్రకటించినా ఎటువంటి చర్యలూ లేవు. అమోనియం లీకైనట్లు కంపెనీ యాజమాన్యం అప్పట్లో ప్రచారం చేసింది. అయితే, ఈ కంపెనీలో అమోనియం లేకపోవడం గమనార్హం.